NTV Telugu Site icon

MI vs RCB: ఉత్కంఠ పోరులో బెంగళూరు విజయం.. ముంబై ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం!

Rcb

Rcb

సోమవారం ముంబై ఇండియన్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 222 పరుగుల భారీ ఛేదనలో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసి ఓడింది. తిలక్‌ వర్మ (56; 29 బంతుల్లో 4×4, 4×6), హార్దిక్‌ పాండ్యా (42; 15 బంతుల్లో 3×4, 4×6) ముంబైని గెలిపించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బెంగళూరు బౌలర్లలో కృనాల్‌ పాండ్యా (4/45), జోష్ హేజిల్‌వుడ్‌ (2/37), యశ్‌ దయాళ్‌ (2/46) రాణించారు. ముంబై ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో నాలుగో ఓడిపోయి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (4) వికెట్‌ కోల్పోయినా.. విరాట్‌ కోహ్లీ (67; 42 బంతుల్లో 8×4 2×6) చెలరేగాడు. దేవదత్ పడిక్కల్‌ (37)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పడిక్కల్‌ కూడా ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. ఆపై రజత్‌ పాటీదార్‌ (64; 32 బంతుల్లో 5×4, 4×6), జితేశ్‌ శర్మ (40 నాటౌట్‌; 19 బంతుల్లో 2×4, 4×6)లు రెచ్చిపోవడంతో ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. బుమ్రా పొదుపుగా బౌలింగ్‌ (0/29) చేశాడు కానీ.. వికెట్‌ మాత్రం తీయలేకపోయాడు. బౌల్ట్ ఏకంగా 57 రన్స్ ఇవ్వడం విశేషం.

భారీ ఛేదనలో ముంబైకి శుభారంభం దక్కలేదు. రోహిత్‌ శర్మ (17), రికిల్‌టన్‌ (17), విల్‌ జాక్స్‌ (22), సూర్యకుమార్‌ యాదవ్ (28) ధాటిగానే ఆరంభించినా పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. 12 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులే చేసిన ముంబై ఓటమి బాటలో సాగింది. ఈ సమయంలో తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యాలు జట్టును గెలిపించడానికి బాగానే ప్రయత్నించారు. చివరి 3 ఓవర్లలో 41 పరుగులు చేయాల్సి రాగా.. ముంబై గెలుస్తుందనుకున్నారు. తిలక్‌ను భువనేశ్వర్ అవుట్ చేసి 13 పరుగులే ఇచ్చాడు. 19వ ఓవర్‌ తొలి బంతికే హార్దిక్‌ను హేజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా.. కృనాల్‌ 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.