NTV Telugu Site icon

IPL 2025: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ!

Virat Kohli Rcb

Virat Kohli Rcb

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ ఒకడు. ముందు బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ అయినా.. పిచ్ ఏదైనా.. బౌలర్ ఎవరైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 252 ఐపీఎల్ మ్యాచ్‌లలో 8,004 పరుగులు చేయగా.. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత 17 సంవత్సరాలుగా ఒకే ఫ్రాంచైజీకి నిలకడగా ఆడుతున్న ఏకైక ప్లేయర్ కూడా కోహ్లీనే. ఐపీఎల్ 2025 మార్చ్ 22 నుంచి ఆరంభం కానుండగా.. విరాట్ 18వ సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2025 ద్వారా టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించడానికి విరాట్ అడుగు దూరంలో ఉన్నాడు.

టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కింగ్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో విరాట్ 9 శతకాలు బాదగా.. అందులో 8 ఐపీఎల్, ఒకటి అంతర్జాతీయ క్రికెట్‌లో చేశాడు. 2022లో ఆసియా కప్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్‌పై అంతర్జాతీయ సెంచరీ బాదాడు. కోహ్లీ మరో సెంచరీ సాధిస్తే.. 10 టీ20 సెంచరీలు సాధించిన మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టిస్తాడు. మొత్తంగా అత్యధిక టీ20 సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (22) అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ (11) రెండో స్థానంలో ఉండగా.. విరాట్ (9) మూడో స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్ 2025 ఎడిషన్‌లో బాబర్ అజామ్‌ను అధిగమించడానికి విరాట్ కోహ్లీకి మంచి సువర్ణావకాశం ఉంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కింగ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆ జోరును ఐపీఎల్ 2025లో కూడా కొనసాగించాలని ఆశిస్తున్నాడు. విరాట్ జూన్ 2024లో అంతర్జాతీయాల టీ20 నుండి రిటైర్ అయ్యాడు. కానీ ఐపీఎల్ టోర్నీలో మాత్రం ఆడుతున్నాడు. ఈ ఎడిషన్‌లో కొత్త రికార్డులు సృష్టించి.. బెంగళూరు టైటిల్ కరువును తీర్చాలని విరాట్ చూస్తున్నాడు. ఫాన్స్ కూడా బెంగళూరు కప్ కొట్టాలని కోరుకుంటున్నారు.