ఐపీఎల్ 18వ సీజన్‌లో ఈరోజు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్‌లో ముంబై నాలుగు మ్యాచులు ఆడి.. కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండాలంటే.. ఇక నుంచి అయినా విజయాలు సాధించాలి. మరోవైపు బెంగళూరు మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలిచి టాప్-3లో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ఏకంగా అగ్రస్థానానికి చేరుకుంటుంది. ‘ఈసాలా కప్ మమ్‌దే’ దిశగా సాగుతున్న ఆర్సీబీని.. వరుస పరాజయాలతో డీలాపడిన ముంబై ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
Also Read: Digvesh Rathi: అందుకే ‘నోట్‌బుక్’ సెలబ్రేషన్స్ చేసుకున్నా.. వీడియో వైరల్!
అయితే ఆర్సీబీపై ఎంఐ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అద్భుత రికార్డు ఉంది. ఆర్సీబీపై 19 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 7.45 ఎకానమీతో 29 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు వాంఖడే స్టేడియంలో బెంగళూరుపై 5 వికెట్ల (5/21) ప్రదర్శనను ఎవరూ మరవలేనిది. ఈ నేపథ్యంలో బుమ్రా మరోసారి విజృంభిస్తే ఆర్సీబీ తక్కువ స్కోర్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. 2013 నుంచి ముంబైకి ఆడుతున్న బుమ్రా.. ఇప్పటివరకూ 133 మ్యాచ్‌ల్లో 165 వికెట్లు తీశాడు. 2023లో వెన్ను గాయంతో జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఈ సీజన్లో మొదటి నాలుగు మ్యాచ్‌లు ఆడలేదు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చికిత్స తీసుకున్నా అతడు తాజాగా బీసీసీఐ మెడికల్ టీమ్ ఫిట్‌నెస్ టెస్టులో పాసై ఆదివారం ముంబై జట్టుతో కలిశాడు. ఈరోజు ముంబైలో బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. బుమ్రా రాకతో ఇప్పటికైనా ముంబై కథ మారుతుందో చూడాలి.