క్రికెట్ ఆటలో గొడవలు, దూషణలు సాధారణం. ముఖ్యంగా మ్యాచ్ రసవత్తరంగా ఉన్న సమయాల్లో ప్లేయర్స్ మాటలు యుద్దానికి దిగుతుంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. శనివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అతి చేశాడు. ముంబై మాజీ ఆటగాడు, గుజరాత్ ప్లేయర్ సాయి కిశోర్‌ను ముందు దూషించి.. ఆపై హగ్ ఇచ్చాడు. ఇందుకు సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: DC vs SRH: స్టార్ బ్యాటర్ వచేస్తున్నాడు.. ఢిల్లీని సన్‌రైజర్స్ అడ్డుకోనేనా?
సొంత మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 196 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై 160 పరుగులే చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్‌ను సాయి కిశోర్ వేయగా.. క్రీజ్‌లో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. సాయి డాట్ బాల్ సంధించడంతో.. హార్దిక్ అసహనానికి గురయ్యాడు. బౌలర్ సాయికి చేరువగా వస్తూ.. అసభ్య పదజాలంతో దూషించాడు. సాయి మాత్రం అలానే చూస్తుండిపోయాడు. అదే సమయంలో అంపైర్లు కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. మ్యాచ్ అనంతరం ఆటగాళ్లంతా కరచాలనం చేసుకుంటున్న సమయంలో.. సాయికి హార్దిక్ షేక్‌హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకున్నాడు. దాంతో హార్దిక్ వివాదానికి తెరదించాడు.