Site icon NTV Telugu

RCB vs PBKS: వారి కోసమైనా ఐపీఎల్ టైటిల్ సాధిస్తాం.. ఆర్సీబీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Rajat Patidar

Rajat Patidar

రెండు నెలలకు పైగా హోరాహోరీగా సాగిన ఐపీఎల్ 2025 చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు అహ్మదాబాద్‌లో ఐపీఎల్ 18 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మంగళవారం రాత్రి 7.30 మొదలయ్యే టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోవడంతో.. నేడు ఆ కలను సాకారం చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. బెంగళూరు, పంజాబ్ టీమ్స్ సమవుజ్జీలుగా ఉండడంతో మ్యాచ్ హోరాహోరీ సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్స్ రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్ సోమవారం ట్రోఫీతో ఫోటోలకు పోజులు ఇచ్చి.. మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజత్ పటీదార్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ కోసం అయినా టైటిల్ సాధించేందుకు ప్రయత్నిస్తాం అని చెప్పాడు. ‘విరాట్ కోహ్లీ కొన్నేళ్లుగా టీమిండియా, ఆర్సీబీకి ఎంతో సేవ చేశాడు. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో గెలవడం మాకు చాలా ముఖ్యం. కోహ్లీ, ముఖ్యంగా అతడి అభిమానుల కోసం ట్రోఫీ గెలవాలి. ఆర్సీబీ ఫాన్స్ మాకు ఎంతో మద్దుతుగా ఉంటారు. ఫైనల్‌లో వంద శాతం గెలవడానికి ప్రయత్నిస్తాం. ఏ ఒక్క చిన్న అవకాశంను వదలం’ అని పటీదార్ తెలిపాడు.

Also Read: IPL 2025 Final: ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు, పంజాబ్‌ అమీతుమీ.. తొలి కల తీరేదెవరిదో!

ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న విరాట్‌ కోహ్లీ ఒక్కసారి కూడా టైటిల్ ముద్దాడలేదు. కెప్టెన్‌గా దశాబ్దానికి పైగా ప్రయత్నించి విఫలమయ్యాడు. పలు సారథుల నాయకత్వంలో బ్యాటర్‌గా కష్టపడ్డా ఫలితం లేకపోయింది. ఇటీవల ఆర్సీబీ ప్లేఆఫ్స్‌ చేరినా.. ఒత్తిడికి చిత్తై ఫైనల్ చేరలేదు. ఈసారి కొత్త కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ సారథ్యంలో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆర్సీబీ.. గొప్పగా ఆడి ఫైనల్‌ చేరింది. విరాట్ కూడా బాగా ఆడాడు. 14 మ్యాచ్‌ల్లో 614 పరుగులు చేశాడు. ఇదే ప్రదర్శనను ఇంకొక్క మ్యాచ్‌లో కొనసాగిస్తే.. 18 ఏళ్ల కల నెరవేరుతుంది. ఫైనల్లో విరాట్ మేటి ఇన్నింగ్స్ ఆడాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Exit mobile version