RCB vs PBKS: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 ఫైనల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చివర్లో తడబడటంతో పంజాబ్ కింగ్స్ (PBKS) ముందు 191 పరుగుల లక్ష్యం ఉంచింది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకోగా, బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.
ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిల్ సాల్ట్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 16 పరుగులతో జట్టు కు ఫ్లైయింగ్ స్టార్ట్ ఇచ్చాడు. కానీ త్వరగా ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ స్థిరంగా ఆడుతూ 35 బంతుల్లో 43 పరుగులు (3 ఫోర్లు) చేశాడు. మయాంక్ అగర్వాల్ (18 బంతుల్లో 24), కెప్టెన్ రాజత్ పటీదార్ (16 బంతుల్లో 26), లివింగ్‌స్టోన్ (15 బంతుల్లో 25), జితేశ్ శర్మ (10 బంతుల్లో 24) రాణించినా, మిగితావారు వారు పెద్ద స్కోర్ చేయలేకపోయారు. చివరి ఐదు ఓవర్లలో బెంగళూరు 58 పరుగులు మాత్రమే సాధించి 5 వికెట్లు కోల్పోయింది. ఈ తడబాటు కారణంగా 200 మార్క్ దాటలేకపోయింది.
ఇక పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీసాడు. అలాగే కైల్ జేమీసన్ కూడా 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. ఓమర్జాయ్, విజయ్ కుమార్ వైశాక్, యుజ్వేంద్ర చహల్ తలో వికెట్ తీశారు.
