NTV Telugu Site icon

Virat Kohli: ఇప్పటికీ నా పేరే.. జట్టులో స్థానం దక్కుతుంది: కోహ్లీ

Virat Kohli Ipl 2024

Virat Kohli Ipl 2024

Virat Kohli React on T20 World Cup 2024: ఐపీఎల్ 2024 ముగిసిన వేంటనే టీ20 ప్రపంచకప్‌ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీ కోసం కొన్ని జట్లు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి. భారత సెలెక్టర్లు కూడా జట్టుపై కసరత్తులు చేస్తున్నారు. అయితే రెండు నెలలకే పైగా క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి జట్టులో స్థానం దక్కుతుందో లేదో అని అందరూ చర్చిస్తున్నారు. జట్టులో తన స్థానంపై అనుమానాలున్న వారికి విరాట్ పరోక్షంగా సమాధానమిచ్చాడు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌ను ప్రమోట్‌ చేయడానికి తన పేరునే వాడుకుంటున్నారని తెలిపాడు. తనకు జట్టులో స్థానం దక్కుతుందని చెప్పకనే చెప్పాడు.

ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఆర్‌సీబీ విజయంలో విరాట్ కోహ్లీ (77; 49 బంతుల్లో 11×4, 2×6) కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. ‘ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న విరాట్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌ను ప్రమోట్‌ చేయడానికి నా పేరునే వాడుకుంటున్నారు. జట్టులో స్థానం దక్కుతుంది’ అని విరాట్ ధీమా వ్యక్తం చేశాడు.

Also Read: Virat Kohli: ప్రజలు మమ్మల్ని గుర్తించని చోట 2 నెలలు ఉన్నాం.. ఆ అనుభవం అవాస్తవం: కోహ్లీ

మ్యాచ్ గురించి మాట్లాడుతూ… ‘జట్టుకు మంచి ఆరంభాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. అయితే వికెట్లు పడితే మాత్రం పరిస్థితులను అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. ఇది సాధారణ ఫ్లాట్ పిచ్ కాదు, కాస్త భిన్నంగా ఉంది. సరైన క్రికెటింగ్ షాట్లు ఆడాలని భావించా. గేమ్‌ను ముగించలేకపోవడం నిరాశపర్చింది. స్లాట్‌లో ఉన్న బంతిని డీప్‌ పాయింట్‌లోకి మళ్లించటంతో అవుట్ అయ్యా. నేను కవర్‌ డ్రైవ్‌ బాగా ఆడతానని వారికి తెలుసు. అందుకే గ్యాప్‌లో కొట్టకుండా.. నన్ను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఎప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చాల్సి వచ్చింది. బెంగళూరు ఫ్యాన్స్‌ నుంచి లభిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు.