NTV Telugu Site icon

Manipur: సీఎం పాల్గొనబోతున్న కార్యక్రమ వేదికకు నిప్పు.. ఆ జిల్లాలో ఇంటర్నెట్ బంద్

Manipur

Manipur

Manipur: మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ పర్యటనకు ముందు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో అక్కడ పెద్ద ఎత్తున గుమిగూడడాన్ని ఆ రాష్ట్ర సర్కారు నిషేధించింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా నుంచి రైతులను, ఇతర గిరిజనులను బయటకు పంపే కార్యక్రమాన్ని నిరసిస్తూ ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన నేపథ్యంలో ఓ మూక సీఎం ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం పాల్గొనబోయే కార్యక్రమ వేదికకు నిప్పు పెట్టింది. గురువారం రాత్రి చురచాంద్‌పూర్ జిల్లాలోని న్యూ లంకాలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఆ వేదికపై ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్ కూర్చోవాల్సి ఉంది. కానీ గురువారం రాత్రే దానిని తగులబెట్టారు. అక్కడే ముఖ్యమంత్రి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న జిమ్‌ కూడా పాక్షికంగా ధ్వంసం అయింది. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి.. ఆ మూకను చెదరగొట్టారు. కానీ వేదికతో పాటు వందలాది కుర్చీలు ధ్వంసమయ్యాయి.

Read Also: Rahul Gandhi: రాహుల్‌గాంధీకి బాంబు బెదిరింపులు.. 60 ఏళ్ల నిందితుడు అరెస్ట్

జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం, ప్రజాశాంతి భంగం, మానవ ప్రాణాలకు, ఆస్తులకు తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చురాచంద్‌పూర్ జిల్లా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ థియెన్‌లత్‌జోయ్ గాంగ్టే గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా నుంచి రైతులను, ఇతర గిరిజనులను బయటకు పంపే కార్యక్రమాన్ని నిరసిస్తూ తాము ప్రభుత్వానికి ఎన్నో వినతిపత్రాలు అందించామని ఆ ఫోరమ్ చెప్పింది. కానీ, ప్రభుత్వం మాత్రం అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆలకించడానికీ అయిష్టత చూపెట్టిందని వివరించింది. అందుకే సీఎం పర్యటన నేపథ్యంలో చురచాంద్‌పూర్ బంద్‌కు పిలుపు ఇచ్చింది.

Show comments