NTV Telugu Site icon

Israel-Gaza: అంతర్జాతీయ కోర్టు సంచలన తీర్పు.. రఫాపై తక్షణమే దాడులు ఆపాలని ఆదేశం

Jdudge

Jdudge

రఫాపై తక్షణమే దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది. వెంటనే పాలస్తీనా ప్రజలకు విముక్తి కల్పించాలని సూచించింది. గాజాలో సైనిక కార్యకలాపాలను ఆపేయాలంటూ ఇజ్రాయెల్‌కు ఆదేశిస్తూ తీర్పును జారీ చేయడం ఇదే తొలిసారి. పాలస్తీనాపై తక్షణమే దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలంటూ దక్షిణాఫ్రికా న్యాయ ప్రతినిధులు గత వారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ చేపట్టింది. తక్షణమే దాడులు ఆపేలా శుక్రవారం కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

ఇక తాజా తీర్పుతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై దౌత్యపరమైన ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యూరోపియన్ దేశాలు పాలస్తీనాకు మద్దతు నిలుస్తున్నాయి. ఇక ఐసీజే తీర్పుతో అది మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు చీఫ్ ప్రాసిక్యూటర్, రక్షణ మంత్రి యోవ్ గాలంట్.. నెతన్యాహు, హమాస్ నాయకులకు అరెస్ట్ వారెంట్‌కు దరఖాస్తు చేశారు.

అయితే హమాస్ చేతిలో తమ పౌరులు బందీలుగా ఉన్నారని.. వారిని విడిపించేందుకు పట్టుదలతో ఉందని ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. తమ వారిని రక్షించేందుకు రఫాపై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ సైన్యం అంటోంది. తాజా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుతో ఇజ్రాయెల్ ఇలా స్పందిస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికా యూనివర్సిటీలు దద్దరిల్లుతున్నాయి. ఇప్పటికే విద్యార్థుల ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలు యూనివర్సిటీలు బహిష్కరణ వేటు కూడా వేశాయి. తాజాగా ఆక్స్‌ఫర్స్ యూనివర్సిటీ దగ్గర ఆందోళనలు ఉధృతం చేయడంతో భవనానికి అధికారులు తాళం వేశారు.

అక్టోబర్ 7న హమాస్ హఠాత్తుగా ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మంది బందీలుగా తీసుకుపోయింది. అందులో పలువుర్ని చంపేసింది. దీంతో ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. ఆనాటి నుంచి ఇజ్రాయెల్.. హమాస్ లక్ష్యంగా దాడులు చేస్తోంది. దీంతో వందలాది మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ యుద్ధం సాగుతోంది.

Show comments