Instagram Love: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!

Instagram

Instagram

Instagram Love: మెదక్ జిల్లాలో సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రేమ పేరుతో ఇద్దరు యువతులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. టేక్మాల్ గ్రామానికి చెందిన ఇద్దరు యువతులను వేర్వేరు పేర్లతో నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన యువకుడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గేష్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరును “రిత్విక్ రెడ్డి”గా మార్చుకుని ఓ యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. యువతి ఆ రిక్వెస్ట్‌ను అంగీకరించడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తాను ఛత్తీస్‌గఢ్‌లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నానని నమ్మించి, ప్రేమ పేరుతో యువతిని మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఆ తర్వాత తనకు ఖర్చుల కోసం డబ్బు అవసరమని, త్వరలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతి నుంచి రూ.5 లక్షల నగదుతో పాటు తులం బంగారు కమ్మలను తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత అతడు యువతితో సంబంధాలను తగ్గించి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

×
×
Ad

మరోవైపు అదే గ్రామానికి చెందిన మరో 17 ఏళ్ల బాలికకు “సాత్విక్ రెడ్డి” పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన దుర్గేష్, ఆమెతో కూడా పరిచయం పెంచుకున్నాడు. ఈసారి తాను ఎంబీబీఎస్ చదువుతున్నానని చెప్పి నమ్మించాడు. చదువుకు, ఇతర ఖర్చులకు డబ్బు అవసరమని చెబుతూ విడతల వారీగా సుమారు రూ.7 లక్షలు రాబట్టాడు. అయితే కొంతకాలం తర్వాత దుర్గేష్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అందుబాటులో లేకపోవడంతో ఇద్దరు బాధితులు మోసపోయినట్లు గుర్తించారు. దీంతో వారు టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది.