Narayana Murthy: భారత్ తయారుచేసిన దగ్గుమందు కారణంగా జాంబియా దేశంలో 66 మంది చిన్నారులు మృతి చెందడం కలకలం రేపింది. దీంతో భారత్‌పై ఆఫ్రికా దేశం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఈ అంశంపై స్పందించారు. భారత్‌లో తయారైన దగ్గుమందు 66 మంది చిన్నారుల మృతికి కారణమైందన్న ఆఫ్రికా ఆరోపణలు మనదేశానికి సిగ్గుచేటు అని అభిప్రాయపడ్డారు. కరోనా టీకాలను అభివృద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేసిన ప్రశంసలు పొందిన మనదేశానికి దగ్గుమందు అపవాదు తీసుకొచ్చిందని ఆరోపించారు. భారతీయ సమాజం ఎదుర్కొనే చికెన్ గున్యా, డెంగీ వంటి వ్యాధులకు ఇంకా టీకాలు కనుగొనలేకపోవడం మన పరిశోధన రంగం వైఫల్యమేనని తెలిపారు.
అటు విజ్ఞాన పరిశోధనల్లో సమన్వయ లోపంతో పాటు నిధులు పొందడంలో పలు విద్యాసంస్థలు అవస్థలు పడుతున్నాయని.. అవి సకాలంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందలేకపోతున్నాయని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి విశ్లేషించారు. సామాజిక అంశాలను పాఠ్యాంశాలుగా నేడు ఐఐటీలు అనుసరించడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లు తాగడం వల్లే పిల్లల్లో తీవ్రమైన కిడ్నీ వ్యాధులు తలెత్తి 66 మంది చిన్నారుల మృతికి కారణమై ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ మేరకు ప్రొమెథజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్‌మాలిన్ బేబీ కాఫ్ సిరప్, మేకాఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ అనే నాలుగు ఔషధాలపై మెడికల్ ప్రొడక్ట్ అలర్ట్ జారీ చేసింది.
Read Also: Special Story on Use of cash: ‘‘ఫీల్ మై క్యాష్’’ అంటే ఏంటో తెలుసా?
కాగా ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ పురస్కారాలను ఆరుగురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. వీరిలో సుమన్ చక్రవర్తి (ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్), సుధీర్ కృష్ణస్వామి (హ్యుమానిటీస్), విధిత వైద్య (లైఫ్ సైన్సెస్), మహేశ్ కాక్డే (గణితం), నిస్సీమ్ కనేకర్ (భౌతిక శాస్త్రం), రోహిణి పాండే (సోషల్ సైన్స్)లకు పురస్కారాలు ప్రకటించారు. వీరికి జనవరిలో పురస్కారాలతో పాటు స్వర్ణ పతకం, లక్ష అమెరికన్ డాలర్లు అందిస్తారు.