సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వన్డే సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఐర్లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. దాంతో ఈ సిరీస్‌కు స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వెస్టిండీస్‌తో సిరీస్‌లో బ్యాటర్‌గా అదరగొట్టిన స్మృతి.. ఇప్పుడు కెప్టెన్‌గానూ రాణించాల్సిన అవసరం ఉంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉదయం 11 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది.
వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లలో స్మృతి మంధాన వరుసగా అయిదు అర్ధ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. ఐర్లాండ్‌పై కూడా అదే జోరు కొనసాగించాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. హర్లీన్ డియోల్, ప్రతీక రావల్, జెమీమా రోడ్రిగ్స్ పరుగులు చేస్తుండడం కలిసొచ్చే అంశం. ఈ సిరీస్‌కు పేసర్ రేణుక సింగ్ దూరమయ్యారు. దాంతో తితాస్ సాధు, సైమాలు బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. ఆల్‌రౌండర్ దీప్తిశర్మ రాణించడం కీలకం. ఐర్లాండ్‌తో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఆడిన 12 వన్డేలలో భారత్ అన్ని గెలిచింది.
మీడియా సమావేశంలో కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ… ‘ఓపెనర్ షెఫాలీ వర్మకు గత రెండు సిరీస్‌లలో జట్టులో స్థానం దక్కలేదు. షెఫాలీ స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రతీక రావల్ బాగా ఆడుతోంది. వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంది. షెఫాలీ దేశవాళీలో సత్తా చాటి తిరిగి జట్టులోకి వస్తుందని భావిస్తున్నాం. జట్టు ప్రణాళికల్లో ఆమె ఉంది. కెప్టెన్సీని ఎంజాయ్ చేస్తా. ఐర్లాండ్‌పై గెలిచేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపారు.