NTV Telugu Site icon

Indian Army: భారత సైన్యానికి 35 వేల ఏకే-203 రైఫిళ్లు.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Ak 203

Ak 203

Indian Army: భారత్-రష్యా జాయింట్ వెంచర్ అయిన ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఆర్‌ఆర్‌పీఎల్) 35 వేల ఏకే-203 కలాష్నికోవ్ అసాల్ట్ రైఫిళ్లను భారత సైన్యానికి అందజేసింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్‌ కింద తయారైన ఈ రైఫిల్స్ సైన్యాన్ని బలోపేతం చేస్తాయి. భారతదేశం సమీకరించిన కలాష్నికోవ్ ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్‌ను ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీలో తయారు చేశారు. భారత్‌-రష్యా మధ్య ఒప్పందం భారతదేశంలో ఏకే-203 రైఫిల్స్ ఉత్పత్తిని నిర్ధారించడమే కాకుండా విస్తృతమైన సాంకేతికత బదిలీని కలిగి ఉంటుంది. అమేథీలోని ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 6 లక్షల 70 వేల రైఫిళ్లను తయారు చేసేందుకు ఆర్డర్ పొందింది.ఉత్తరప్రదేశ్‌లో అమేథీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి సౌకర్యాలు పూర్తిగా అత్యాధునిక యంత్రాలు, సాంకేతికతతో ఉన్నాయి. ఇప్పుడు నాణ్యమైన అసాల్ట్ రైఫిల్స్ తయారీ శరవేగంగా జరుగుతోంది. ఈ సౌకర్యాల ఏర్పాటులో భారతీయ, రష్యా సంస్థల మధ్య సహకారం ముఖ్యమైనది.

Read Also: TGSRTC MD Sajjanar: సిటీ బస్సులో మహిళకు ప్రసవం చేసిన లేడీ కండక్టర్.. సజ్జనార్ ట్వీట్..

ఏకే-203 అసాల్ట్ రైఫిల్ ఏకే-200 సిరీస్ ఆధునిక వెర్షన్ అనే సంగతి తెలిసిందే. ఇందులో 7.62×39 మిమీ క్యాట్రిడ్జ్‌లను ఉపయోగించారు. ఈ రైఫిల్ కలాష్నికోవ్ రైఫిల్స్ సాంప్రదాయ లక్షణాలను కలిగి ఉంది. దీని నిర్వహణ సులభం. ఈ రైఫిల్స్ అధిక నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. వివిధ ఆపరేటింగ్ పరిస్థితుల్లో ఆశించిన విధంగా పని చేస్తాయి. ఇది భారత సైన్యానికి తగిన ఎంపికగా మారింది.

ఏకే-203 రైఫిల్ ఏకే సిరీస్‌లో అత్యంత ప్రాణాంతకమైన, ఆధునిక రైఫిల్. యుద్ధభూమిలో సైనికుడికి కావాల్సిన అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఏకే-203 బరువు కేవలం 3.8 కిలోలు కాగా.. కేవలం 705 మిమీ పొడవు మాత్రమే. చిన్నగా, తేలికగా ఉండటం వల్ల ఎక్కువసేపు మోసుకెళ్లినా అలసట ఉండదు. ఏకే-203 రైఫిల్ 7.62×39మిమీ బుల్లెట్లను కాలుస్తుంది. 800 మీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అంటే ఏకే-203 పరిధిలోకి వస్తే శత్రువులెవరైనా తప్పించుకోవడం కష్టమే. ఈ రైఫిల్ ఒక నిమిషంలో 700 బుల్లెట్లను కాల్చగలదు. ఏకే-203 రైఫిల్‌లో 30 రౌండ్ల బాక్స్ మ్యాగజైన్ ఉంది. ఇదొక్కటే కాదు, శత్రువును దూరం నుండి బైనాక్యులర్స్ ద్వారా చూసేందుకు కూడా ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ప్రత్యేకత మరింత ప్రాణాంతకం చేస్తుంది. వాస్తవానికి, ఇతర అసాల్ట్ రైఫిల్స్‌లో నిర్దిష్ట రకమైన టెలిస్కోప్‌ను మాత్రమే అమర్చవచ్చు, అయితే ప్రపంచంలోని ఏ టెలిస్కోప్‌నైనా ఏకే-203లో అమర్చవచ్చు.