NTV Telugu Site icon

IndiGo Flight Emergency Landing: ఇండిగో విమానంకు తప్పిన పెను ప్రమాదం.. టేకాఫ్‌ అయిన 3 నిమిషాలకే..!

Indigo Flight

Indigo Flight

IndiGo Flight makes Emergency Landing in Patna due to Engine Fail: దేశీయ విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన ఓ విమానంకు పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్‌ అయిన 3 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం పట్నా విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఇంజిన్‌ వైఫల్యం కారణంగానే.. విమానం టేకాఫ్‌ అయిన మూడు నిమిషాలకే అత్యవసరంగా దించేశారు. దాంతో ఇండిగో విమానంలో ఉన్న వారు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.

అధికారుల వివరాల ప్రకారం… పట్నాలోని జయప్రకాశ్‌ నారాయణ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈరోజు ఉదయం ఇండిగో 6ఈ 2433 నంబర్ విమానం ఢిల్లీకి బయల్దేరింది. టేకాఫ్‌ అయిన 3 నిమిషాలకే విమానంలోని ఒక ఇంజిన్‌ పని చేయలేదు. ఇది గమనించిన పైలట్‌.. వెంటనే ఏటీసీకి సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన ఏటీసీ అధికారులు విమానాన్ని అత్యవసరంగా (ఎమర్జెన్సీ ల్యాండింగ్‌) దించేశారు. ఉదయం 9.11 గంటలకు విమానం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. దాంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

ప్రస్తుతం పట్నాలోని జయప్రకాశ్‌ నారాయణ్‌ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలన్నీ సజావుగానే సాగుతున్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులను మరో విమానంలో ఢిల్లీ పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జులైలో కూడా ఓ ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన గంటకు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయింది. టైర్‌ పేలి ఉంటుందన్న అనుమానంతో ప్యారిస్‌ బయల్దేరిన విమానాన్ని వెనక్కి మళ్లించి.. ఢిల్లీలో అత్యవసరంగా దించేశారు.

Also Read: Donation Astro Tips: పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయకూడదు.. చేశారో దురదృష్టం ఇక మీ వెంటే!