IndiGo CEO Apology: ఇండిగో విమానయాన సంస్థ గత మూడు రోజులుగా ఆపరేషనల్ సమస్యలను ఎదుర్కొంటోంది. భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో పాటు అనేక ఫ్లైట్లు ఆలస్యమవుతుండటంతో దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులపై ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈరోజు (డిసెంబర్ 4న) అధికారికంగా క్షమాపణలు చెప్పారు. ఆయన స్టాఫ్‌కు పంపిన అంతర్గత ఈ-మెయిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోజుకు 3.8 లక్షల మంది ప్యాసింజర్లకు సేవలు అందించే సంస్థగా ప్రతి ప్రయాణికుడికి మంచి అనుభవం ఇవ్వాల్సిందేనని, కానీ గత కొన్ని రోజుల్లో ఆ హామీని నిలబెట్ట లేకపోయామని ఎల్బర్స్ ఒప్పుకున్నారు. చిన్న సాంకేతిక లోపాలు, షెడ్యూల్ మార్పులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన రంగంలో అధిక రద్దీ, అలాగే కొత్తగా అమల్లోకి వచ్చిన FDTL నిబంధనలు కలిసి ఆపరేషన్లపై ఇండిగో విమానాలపై తీవ్ర ప్రభావం చూపాయి. పైలట్లు, క్యాబిన్ క్రూ, ఇంజినీర్లు లాంటి అన్ని ఆపరేషనల్ సిబ్బందికి సీఈవో పీటర్ ఎల్బర్స్ కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: ACB : మరో అవినీతి తిమింగలం.. ఆదాయానికి మించి రూ.100 కోట్లు
అయితే, ఇండిగో విమానయాన సంస్థ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇవాళ ఒక్కరోజే 300కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. నవంబర్ నెలలో మొత్తం 1,232 విమానాలు క్యాన్సిల్ కావడంతో DGCA దర్యాప్తుకు ఆదేశించింది. విమానాల రద్దు కారణాలను వివరించాలని ఇండిగోను కోరగా, 755 విమానాలు స్టాఫ్ కొరత, 92 ATC వైఫల్యం, 258 ఎయిర్‌పోర్ట్ పరిమితుల కారణంగా, ఇంకా 127 ఇతర కారణాలతో రద్దయ్యాయని వెల్లడించింది. ఈ పరిస్థితులను సరిచేయడానికి రెండు రోజుల సమయం కావాలని ఇండిగో సంస్థ కోరింది. అయితే, ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యాన్ని తగ్గించేందుకు తమ బృందాలు రాత్రి పగలు పని చేస్తున్నాయని ఇండిగో విమానయాన సంస్థ పేర్కొంది.
