WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?

Wtc India

Wtc India

WTC India: అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ముల్లాన్‌ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ లో భారత్ ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో గెలిచి 94 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. అయితే ఈ ఘన విజయం భారత అభిమానులకు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో మాత్రం ఎలాంటి మార్పు తీసుకురాలేదు.

దీనికి కారణం అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ డబ్ల్యూటీసీ (WTC) సైకిల్‌లో భాగం కాదు. అఫ్గానిస్థాన్ క్రికెట్ అభివృద్ధికి మద్దతుగా నిర్వహించిన ప్రత్యేక ద్వైపాక్షిక మ్యాచ్ మాత్రమే కావడంతో ఈ ఫలితానికి పాయింట్ల పట్టికపై ప్రభావం ఉండదు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో భారత్ 48.15% విజయాల శాతంతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు తొమ్మిది టెస్ట్‌లు ఆడిన భారత జట్టు నాలుగు విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేయగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.

×
×
Ad

ఇంగ్లండ్ పర్యటనతో ఈ డబ్ల్యూటీసీ చక్రాన్ని ప్రారంభించిన భారత్ ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. అనంతరం వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే అదే జోరును కొనసాగించలేక దక్షిణాఫ్రికా చేతిలో సొంతగడ్డపై 2-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఈ పరాజయం కారణంగానే భారత్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. ఫైనల్ బెర్త్ కోసం పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మిగిలిన మ్యాచ్‌లు టీమిండియాకు కీలకంగా మారాయి.

ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్ ఇంకా తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో శ్రీలంక పర్యటనలో రెండు టెస్ట్‌లు, న్యూజిలాండ్‌లో రెండు టెస్ట్‌లు, స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఉన్నాయి. ఫైనల్ అవకాశాలను అందుకోవాలంటే ఈ తొమ్మిది మ్యాచ్‌ల్లో కనీసం 7 విజయాలు అందుకోవాలి. ముఖ్యంగా న్యూజిలాండ్ గడ్డపై భారత జట్టు ప్రదర్శనపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. అక్కడ భారత్ చివరిసారిగా 2009లో టెస్ట్ మ్యాచ్ గెలిచింది. దీంతో కివీస్ గడ్డపై జరిగే రెండు టెస్ట్‌లు డబ్ల్యూటీసీ భవిష్యత్తును నిర్ణయించే మ్యాచ్‌లుగా మారనున్నాయి. అఫ్గానిస్థాన్‌పై సాధించిన భారీ విజయం పాయింట్లు ఇవ్వకపోయినా, రాబోయే కఠిన సిరీస్‌లకు ముందు భారత జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని అందించింది.