Hyderabad: ప్రముఖ అంతర్గత భద్రతా నిపుణుడు డాక్టర్ పి.వి. రమణ రచించిన “ఇండియాస్ మావోయిస్ట్స్: గ్లింప్సెస్ ఇన్టు రెడ్ ఇన్సర్జెన్సీ” (India’s Maoists: Glimpses into Red Insurgency) గ్రంథావిష్కరణ సభ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఐసీసీసీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. న్యూఢిల్లీకి చెందిన వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (వీఐఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించి, గ్రంథ సారాంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర భద్రతా సలహాదారు, తెలంగాణ మాజీ డీజీపీ బి. శివధర్ రెడ్డి (ఐపీఎస్-రిటైర్డ్), ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సిహెచ్. ద్వారకా తిరుమలరావు (ఐపీఎస్-రిటైర్డ్), శాంతిభద్రతల విభాగం డీజీపీ మహేష్ ఎం. భగవత్ (ఐపీఎస్), ఆపరేషన్స్ విభాగం డీజీపీ అనిల్ కుమార్ (ఐపీఎస్), ఆర్టీసీ ఎండీ వి.సి. సజ్జనార్ (ఐపీఎస్), ‘తెలంగాణ టుడే’ ఎడిటర్ కె. శ్రీనివాస్ రెడ్డి, పుస్తక రచయిత డాక్టర్ పి.వి. రమణ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
రాజ్యాంగ హక్కుల చైతన్యంతోనే తీవ్రవాద ప్రభావం తగ్గింపు: బి. శివధర్ రెడ్డి
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. వివిధ ప్రభుత్వ విభాగాలు, భద్రతా విభాగాలు సమష్టిగా, సమన్వయంతో కృషి చేయడం వల్లే మావోయిజాన్ని నియంత్రించడం, దాని ప్రభావాన్ని తగ్గించడం సాధ్యమైందని స్పష్టం చేశారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో బహుముఖ వ్యూహాలు, సమన్వయ క్షేత్రస్థాయి పరిశోధనలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కులు, సామాజిక న్యాయాన్ని నొక్కిచెప్పిన అంబేడ్కరిజం ప్రభావం ప్రజల్లో విస్తృతమైన అవగాహనను తీసుకొచ్చిందని, ఇది మావోయిస్టుల భావజాల ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టిందని ఆయన విశ్లేషించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ నిబంధనలు, సమ్మిళిత పాలనను ఆచరించడం ద్వారానే సమాజాన్ని హింసాత్మక తీవ్రవాదం నుంచి సుస్థిర ప్రగతి వైపు విజయవంతంగా నడిపించగలిగామని ఆయన వివరించారు.
భద్రతా విజయాలతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం: ద్వారకా తిరుమలరావు
‘రాబోయే సవాళ్లు’ అనే అంశంపై ఏపీ మాజీ డీజీపీ సిహెచ్. ద్వారకా తిరుమలరావు ప్రసంగిస్తూ.. భద్రతా బలగాలు కీలక విజయాలు సాధించినప్పటికీ, శాశ్వత శాంతి నెలకొనాలంటే నిరంతర నిఘాతో పాటు అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కొత్తగా ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌లను (FOBs) ఏర్పాటు చేస్తూ, కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPFs) ఉపసంహరణను అత్యంత సమగ్రంగా సమీక్షించాలని సూచించారు.
గతంలో లూటీ అయిన పోలీసు ఆయుధాలు, మైనింగ్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, మావోయిస్టుల పట్టణ నెట్‌వర్క్‌లను, అక్రమ నిధుల మార్గాలను క్రమపద్ధతిలో పూర్తిగా నిర్వీర్యం చేయాల్సిన తక్షణ అవసరం ఉందన్నారు. గతంలో నక్సలిజం ప్రభావం ఉన్న 196 జిల్లాల్లో ఏ ఒక్కటీ మళ్లీ తీవ్రవాదం వైపు జారిపోకుండా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సాయుధ పోరాటం కన్నా అభివృద్ధి, బాధ్యతాయుత పాలన, ఆర్థిక సమ్మిళితత్వానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
పుస్తకంలో వాస్తవ ఆధారాలు, రహస్య నెట్‌వర్క్‌ల వివరాలు: రచయిత డాక్టర్ పి.వి. రమణ
రచయిత డాక్టర్ పి.వి. రమణ పుస్తక విశేషాలను వివరిస్తూ.. సీపీఐ (మావోయిస్టు) సంస్థాగత నిర్మాణం, వారి ప్రజా సంఘాలు (మాస్ ఫ్రంట్స్), పట్టణ నెట్‌వర్క్‌లు, మహిళా కేడర్, ఈశాన్య రాష్ట్రాలతో గల సంబంధాలను వివరిస్తూ ప్రత్యేక అధ్యాయాలను పొందుపరిచినట్లు తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించిన 196 నక్సల్ ప్రభావిత జిల్లాల వివరాలను వాస్తవిక జీఐఎస్ మ్యాపులు, అధికారిక సమాచారంతో ప్రచురించినట్లు పేర్కొన్నారు.
మావోయిస్టుల ఆర్థిక నెట్‌వర్క్‌లతో పాటు అటవీ ప్రాంతాలు, పట్టణ కేంద్రాల్లో వందలాది బంగారు బిస్కెట్లు, కోట్ల రూపాయల నగదును రహస్య డంపుల్లో దాచిన నిర్దిష్ట ఉదంతాలను ఇందులో వెల్లడించామన్నారు. ప్రధాన ఆయుధ డిపోలపై దాడులు, వ్యూహాత్మక ఆకస్మిక దాడులు (ఆంబూష్లు), విఫలమైన శాంతి చర్చలు, ప్రభుత్వ లొంగుబాటు-పునరావాస విధానాల్లో ఉన్న లోపాలను నిశితంగా విశ్లేషించినట్లు ఆయన పేర్కొన్నారు.
సమగ్ర అధ్యయనం – భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక
2004 నుంచి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన విస్తృత క్షేత్రస్థాయి పరిశోధనల ఆధారంగా ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. భద్రతా సిబ్బంది, విధాన నిర్ణేతలు, పరిశోధకులు, లొంగిపోయిన కేడర్లతో జరిపిన విస్తృత ఇంటర్వ్యూలను ఆధారం చేసుకుని, 2025–2026 భద్రతా పరిణామాలను సైతం విశ్లేషిస్తూ గ్రంథాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దారు. సమస్య పరిష్కారానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, ఎన్జీవోలు, స్థానిక వర్గాలు, లొంగిపోయిన కేడర్ భాగస్వామ్యంతో కూడిన ‘పీపీపీపీ’ (Public, Private, People Partnership) విధానాన్ని గ్రంథం ప్రతిపాదించింది. లొంగుబాటు-పునరావాస పథకాలను సంస్కరించి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లు, భూమి పంపిణీ, ఆర్థిక నిర్వహణ శిక్షణ వేగవంతంగా అందించాలని, పెండింగ్ కేసుల త్వరితగతిన పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో త్రైమాసిక సమీక్ష కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
అలాగే స్థానిక రహదారులు, కలప పనులను పెద్ద కాంట్రాక్టర్లకు కాకుండా గ్రామ కమిటీలకే అప్పగించాలని, మౌలిక సదుపాయాలు, మైనింగ్ ప్రాజెక్టులలో స్థానిక మూలవాసులు, డిప్లొమా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పించాలని సూచించారు. సీఎస్సార్ (CSR), జిల్లా మినరల్ ఫండ్స్ (DMF) నిధులను కేవలం ప్రభావిత ప్రాంతాల్లోని విద్య, తాగునీరు, వైద్యానికే వెచ్చించాలని స్పష్టం చేశారు. ప్రాణాంతక సెరిబ్రల్ మలేరియాను 24 గంటల్లో నియంత్రించేందుకు బైక్ అంబులెన్సుల విస్తరణ, ఏకలవ్య పాఠశాలల పెంపు, లొంగిపోయిన వారి విజయగాథలను స్థానిక మాధ్యమాల్లో ప్రముఖంగా ప్రచారం చేయాలని గ్రంథంలో మార్గదర్శకాలు నిర్దేశించారు. రచయిత డాక్టర్ పి.వి. రమణ జేఎన్‌యూ నుంచి పీహెచ్డీ పొందారు. వామపక్ష తీవ్రవాదంపై ఆయన ఇప్పటికే పలు గ్రంథాలు రచించడంతో పాటు జేన్స్ ఇంటెలిజెన్స్ రివ్యూకు వ్యాసాలు రాశారు. పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యూరో (BPR&D) లొంగుబాటు విధానాల నిపుణుల కమిటీలో పనిచేసిన ఆయన, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు కన్సల్టెంట్‌గా, అమెరికాలోని పెంటగాన్, వుడ్రో విల్సన్ సెంటర్లలో సైతం ఉపన్యాసాలు అందించారు.

