New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..

New Bank

New Bank

డిజిటల్ విప్లవంలో భాగంగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం గౌహతిలో దేశంలోనే మొదటి ‘ఏఐ ఆధారిత డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్’ను ప్రారంభించారు. ‘స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్’ (Slice Small Finance Bank) ఈ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో అసోం ఎమ్మెల్యే అశోక్ సింఘాల్, స్లైస్ ఎండీ రాజన్ బజాజ్, ఎన్‌పీసీఐ ఎండీ దిలీప్ అస్బే తదితరులు పాల్గొన్నారు.

ఈ కొత్త బ్యాంక్ బ్రాంచ్ డిజిటల్, ఫిజికల్ సేవలను కలిపి అందిస్తుంది. ఇక్కడ ఏఐ కియోస్క్‌లు, క్యూఆర్ కోడ్ బ్యాంకింగ్, తక్షణ అకౌంట్ ఓపెనింగ్, డిజిటల్ పాస్‌బుక్ ప్రింటింగ్ వంటి అధునాతన సేవలు లభిస్తాయి.

ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. అసోం డిజిటల్ ప్రయాణంలో ఇదొక మైలురాయి అని, గౌహతి నగరం పెద్ద కంపెనీలకు కేంద్రంగా మారుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. ఆర్‌బీఐ అనుమతితో ‘నార్త్‌ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్’, ఫినోటెక్ స్టార్టప్ ‘స్లైస్’ విలీనమై ఈ కొత్త బ్యాంక్‌గా ఏర్పడిందని, దీని ప్రధాన కార్యాలయం గౌహతిలోనే ఉందని బ్యాంక్ చైర్‌పర్సన్ యూజీన్ కార్థక్ తెలిపారు. ఈ బ్యాంక్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ప్రతిరోజూ వడ్డీని జమ చేస్తుంది.

ఈశాన్య రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను సులభంగా చేర్చడమే లక్ష్యంగా గౌహతిని ఎంచుకున్నట్లు బ్యాంక్ యాజమాన్యం తెలిపింది. మిజోరం, నాగాలాండ్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ బ్యాంకులు తక్కువగా ఉన్నాయని, డిజిటల్ విధానం ద్వారా అక్కడి ప్రజలందరికీ సులువుగా సేవలు అందించవచ్చని పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను చేర్చడమే తమ లక్ష్యమని, రాబోయే 2-3 ఏళ్లలో ఈశాన్య భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ బ్యాంకింగ్ సంస్థగా ఎదగాలని చూస్తున్నట్లు స్లైస్ ఎండీ రాజన్ బజాజ్ వివరించారు.