భారతీయ విద్యార్థులకు ఇష్టపడే గమ్యస్థానాల్లో కెనడా ఒకటి. ఇమ్మిగ్రేషన్ రెఫ్యూజీస్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) డేటా ప్రకారం.. కెనడాలోని మొత్తం 226,450 మంది భారతీయులు ఉన్నారు. ప్రతి 10 మంది విదేశీయుల్లో నలుగురు భారతీయులే ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు కెనడా ప్రభుత్వ విధానాలతో అక్కడి భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రికి రాత్రే ఇమ్మిగ్రేషన్ పాలసీల్లో మార్పులు చేసి, వర్క్ పర్మిట్‌లను నిరాకరించడంతో వందల మంది విద్యార్థులు ఇప్పుడు ఆ దేశం నుంచి బహిష్కరణ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడా ప్రభుత్వ తీరును నిరసిస్తూ కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ రీజియన్‌లో ఆందోళనకు దిగారు. తమను దేశంలో ఉండేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినా.. వర్క్ పర్మిట్‌లు ఇవ్వడం లేదని, దీంతో కెనడా నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇటీవల కెనడా తీసుకొచ్చిన నూతన విధానాలతో ముఖ్యంగా భారతీయ విద్యార్థులకే ముప్పు పొంచి ఉంది.
READ MORE: Cabinet Meeting: నేడు క్యాబినెట్ భేటీ.. వ్యవసాయ రంగంపై ప్రధాన చర్చ?
మరోవైపు బ్రిటన్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రాడ్యుయేట్ రూట్ వీసా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. దీని ద్వారా విదేశీ విద్యార్థుల్లో ప్రతిభావంతులైన వారిని మాత్రమే బ్రిటన్‌లో ఉండనిచ్చేందుకు అవకాశం ఇవ్వాలని రిషి సునాక్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. దీంతోపాటు విదేశీ విద్యార్థులను తప్పు దోవ పట్టించే సమాచారాన్ని అందించే రిక్రూట్‌మెంట్ ఏజెంట్లపై అణచివేత చర్యలు చేపట్టాలని తలచింది. అయితే ఈ విషయాన్ని సునాక్ మంత్రులతో ఇంకా చర్చించలేదని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక తెలిపింది. ఈ దేశాలు ఏమేరకు నిర్ణయాలు తీసుకుంటాయనే అంశంపై పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.