NTV Telugu Site icon

Gaddar Passes Away: ప్రజా గాయకుడు గద్దర్ జీవిత విశేషాలు.. మూగబోయిన ఉద్యమ గళం

Gaddar Passes Away

Gaddar Passes Away

Gaddar Passes Away: దళిత రచయిత, గద్దర్‌గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు ప్రముఖ విప్లవ కవి. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ తుదిశ్వాస విడిచారు. ఇవాళ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గద్దర్‌ ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు గద్దర్ అను పేరును స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గదర్ పార్టీకి గుర్తుగా తీసుకోవడం జరిగింది.

జీవిత ప్రస్థానం 

గద్దర్ మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో పేద కుటుంబంలో జన్మించాడు. హైదరబాద్‌లో ఆయన ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను అందరికీ తెలియజెప్పడానికి ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” పాట రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.

Also Read: Big Breaking: ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూత

కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకథలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు. ఆ తర్వాత ఆయన అనేక పాటలు రాశారు. 1972లో జన నాట్య మండలి ఏర్పడింది. ఇది పల్లెల్లో జరుగుతున్న అకృత్యాలను, అరాచకాలను ఎదురించేందుకు, దళితులను మేల్కొల్పేందుకు వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడింది. అయితే 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ పరీక్ష రాశారు. అయన కెనరా బ్యాంకులో క్లర్క్‌గా చేరారు, తర్వాత వివాహం చేసుకున్నారు, భార్య పేరు విమల, ఆయనకు ముగ్గురు పిల్లలు. సూర్యుడు, చంద్రుడు ( 2003లో అనారోగ్యంతో మరణించారు), కూతురు వెన్నెల.

ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ.. 

మా భూమి సినిమాలో సాయుధ పోరాటయోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన “బండెనక బండి కట్టి” అనే పాటను ఆయనే పాడి, ఆడారు. 1984లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసారు.1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్లారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవాడు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియజెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు క్యాసెట్లుగా, సీడీలుగా రికార్డ్ అయ్యి అత్యధికంగా అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రజల్లో ఉన్న అభిమానం వల్ల ప్రజా యుద్ధనౌక అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. మర్రి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్లపై ఆయన ఉదారంగా వ్యవహరించారు. వారిపై నిషేధం ఎత్తి వేయబడింది. 1990 ఫిబ్రవరి 18న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.

గద్దర్‌పై హత్యాయత్నం
1997 ఏప్రిల్ 6న ఆయనపై పోలీసులు విరుచుకు పడ్డారు. ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి. అన్ని బుల్లెట్లను తొలగించారు. కానీ ఒక్క బుల్లెట్‌ను మాత్రం డాక్టర్లు తొలగించలేదు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. ఆయన ఒంట్లో ఇప్పటికి బుల్లెట్ ఉంది. ఆ తర్వాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు, విప్లవ రచయితల సంఘం ద్వార ప్రజలను చైతన్య పరుస్తున్నారు. 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవర రావులను తమ దూతలుగా పంపారు. నకిలీ ఎన్కౌంటర్లలను ఆయన తీవ్రంగా నిరసించారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమించిన వీరుడు 
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాటలు ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చాయి. గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు, నిమ్న కులాల ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తన మద్దతును తెలపటానికి ప్రారంభించారు. బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ, ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశంలోని కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో తన భావాలను పంచుకోలేదు. దీనిని బట్టి చూస్తే ప్రత్యేక తెలంగాణ కోరుకున్న నాయకుల్లో గద్దరు కూడా ఒకరు. గద్దర్ మొదటి నుంచి తెలంగాణవాదిగానే ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన తెలంగాణకే మద్దతు తెలిపారు. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు గద్దర్. గద్దర్‌పై దాడి జరిగినప్పుడు హోం మినిస్టర్ దేవేందర్ గౌడ్. ఆయన ప్రస్తుత ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ద్వారా ముందుకు వెళ్తున్నారు.

పాటలతో ప్రజల్లోకి.. 

ఆయన రాసిన పాటల్లో “అమ్మ తెలంగాణమా” అనే పాట ఎంతో ప్రజాదరణ పొందింది. తెలంగాణలోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన “నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ” అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది. అయితే ఆయన ఆ అవార్డ్‌ను తిరస్కరించారు. ఇటివల ఆయన మరోసారి “జై బోలో తెలంగాణ” సినిమాలో తెరపైన కనిపించారు. ‘పొడుస్తున్న పొద్దూ’ మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది. “అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా” అనే పాటను ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇలాంటి ఎన్నో ఉద్యమ గీతాలను రచించి, ఆడి పాడి ప్రజల్లో చైతన్య జ్వాలలను రగిలించిన అమరవీరుడు గద్దర్.