Site icon NTV Telugu

Ajay Banga: ప్రపంచ బ్యాంకు చీఫ్‌గా భారత సంతతికి చెందిన అజయ్ బంగా ఎన్నిక!

Ajay Banga

Ajay Banga

Ajay Banga: కొన్నేళ్లగా భారతీయులు ప్రతి రంగంలోనూ తమ సత్తాను చాటుతున్నారు. ప్రపంచదేశాల్లో నాయకులుగా, సారథులుగా ఎదుగుతున్నారు. భారత సంతతికే చెందిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారు. సుందర్ పిచాయ్.. గూగుల్, దాని మాతృసంస్థ అల్పాబెట్ సీఈఓగా ఉన్నారు. ఇటీవల యూట్యూబ్ సీఈఓగా భారతీయుడు నీల్ మోహన్ పగ్గాలు చేపట్టారు. ఇంకా పెద్ద లిస్టే ఉంది. తాజాగా మరో భారత సంతతి వ్యక్తి అజయ్‌ బంగా ఏకంగా వరల్డ్‌ బ్యాంక్‌ అత్యున్నత పదవిని చేపట్టనున్నారు. ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించే అవకాశాన్ని అజయ్‌ బంగా దక్కించుకున్నారు. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని బహిరంగంగా ప్రతిపాదించక పోవడంతో బుధవారం నామినేషన్లు ముగిసిన తర్వాత తదుపరి అధ్యక్షుడిగా అజయ్‌ బంగా దాదాపుగా ఖరారయ్యారు.

ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ దాదాపు ఒక సంవత్సరం ముందుగానే పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించిన తర్వాత మాజీ మాస్టర్ కార్డ్ ఇంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను గత నెలలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అజయ్ బంగా పేరును ప్రతిపాదించారు. 2019లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేసిన డేవిడ్ మాల్పాస్ ఏకపక్షంగా అగ్రస్థానంలో నిలిచారు. ఇదిలా ఉంటే వరల్డ్‌ బ్యాంకు చీఫ్‌గా అమెరికా ప్రతిపాదించిన వారికే అవకాశం రావడం సహజమే. యూఎస్‌తో పాటు ఏ దేశాలు అభ్యర్థులను ప్రకటించనప్పటికీ, ప్రపంచ బ్యాంక్ నియమాలు సభ్య దేశాలు బుధవారం మధ్యాహ్నం మూసివేసిన విండోలో నామినేషన్లు వేయడానికి అనుమతిస్తాయి.

వాషింగ్టన్‌కు చెందిన ప్రపంచ బ్యాంక్ ఫిబ్రవరి చివరలో నామినేషన్ వ్యవధిని ప్రారంభించింది. నామినేషన్లు ముగిసిన తర్వాత దాని బోర్డు అగ్ర పోటీదారులకు అధికారిక ఇంటర్వ్యూలను నిర్వహిస్తుందని, మే ప్రారంభంలో ప్రక్రియ ముగుస్తుందని ఆ సమయంలో పేర్కొంది. అజయ్‌ బంగా తన నామినేషన్‌కు మద్దతు కోసం గత నెలలో ప్రపంచ పర్యటనలో సమయం గడిపారు. అందులో చైనా, కెన్యా, ఐవరీ కోస్ట్‌లతో పాటు యూకే, బెల్జియం, పనామా, భారత్‌లో పర్యటించారు.

Read Also: Pope Francis: పోప్‌ ఫ్రాన్సిస్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స

ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవి కోసం నామినేట్ తొలి భారత సంతతి వ్యక్తి అజయ్ బంగా కావడం గమనార్హం. ఈయన నియామకం ఖరారైతే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించిన డేవిడ్ మాల్‌పాస్ జూన్‌లో ఆ పదవి నుంచి దిగిపోనున్నారు. అజయ్‌ బంగాకు ఫైనాన్సింగ్ రంగంలో 30 ఏళ్లకు పైగా అపార అనుభవం ఉంది. బంగా ప్రస్తుతం ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌కు వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఇంకా మాస్టర్‌ కార్డ్‌లో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. మాస్టర్‌కార్డ్‌లో 12 ఏళ్లు పనిచేసిన తర్వాత 2021, డిసెంబర్‌లో సీఈఓ పదవి నుంచి రిటైర్ అయ్యారు. ఆయన హయాంలో మాస్టర్‌కార్డ్ ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. అమెరికా ప్రభుత్వంతో అత్యంత దగ్గరగా ఆయన పని చేశారు. అమెరికా ట్రేడ్ పాలసీ అండ్ నెగోషియేషన్స్ ప్రెసిడెంట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. 2015 ఫిబ్రవరిలో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా బంగాను ఇందుకు ఎంపిక చేశారు.

ప్రస్తుతం అమెరికా పౌరుడిగా ఉన్న అజయ్ బంగా.. బాల్యజీవితం భారతదేశంలోనే గడిచింది. 1959, నవంబర్ 10న పుణెలో జన్మించారు. ఆయన తండ్రి హర్బజన్ సింగ్ బంగా.. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్‌గా పనిచేశారు. తర్వాత రిటైర్ అయ్యారు. ఎక్కువగా అమెరికాతో దగ్గరగా పనిచేసినప్పటికీ భారత ప్రభుత్వం బంగాను గౌరవించింది. 2016లో భారతదేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో ఆయనను సత్కరించింది.

Exit mobile version