Indian Navy: భారత నౌకాదళంలోకి 8 కొత్త స్టెల్త్ యుద్ధనౌకలు.. రూ. 40 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

Indian Navy 8 Next Generation Stealth

Indian Navy 8 Next Generation Stealth

Indian Navy: భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. నేవీ (Navy) కోసం ఏకంగా ఎనిమిది నెక్స్ట్-జెనరేషన్ స్టెల్త్ నౌకల (నెక్స్ట్-జెనరేషన్ కార్వెట్లు – NGC) నిర్మాణానికి రూ.40,000 కోట్లకు పైగా బడ్జెట్‌ను కేటాయిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో రక్షణ రంగంలో అత్యున్నత స్థాయిలో క్లియరెన్స్ సాధించిన అతిపెద్ద ప్రాజెక్టులలో ఇది ఒకటి. దీనికి సంబంధించిన అధికారిక ఒప్పందాలు కూడా కలకత్తాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (GRSE), గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL)లతో త్వరలోనే రూపుదిద్దుకోనున్నాయి.

అసలు ఏమిటీ కార్వెట్ యుద్ధనౌకలు?
సాధారణంగా కార్వెట్లు అంటే పరిమాణంలో ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్ల కంటే కాస్త చిన్నవిగా, అత్యంత వేగంగా ప్రయాణించే శక్తివంతమైన యుద్ధనౌకలు. తీరప్రాంత రక్షణ, నిఘా, సముద్రపు పహారా కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. చిన్నవిగా ఉన్నప్పటికీ, అనేక రకాల అధునాతన ఆయుధాలను, అత్యాధునిక సెన్సార్లను ఇవి మోసుకెళ్లగలవు. భారత నౌకాదళం కోసం రూపొందించబోయే ఈ కొత్త తరం కార్వెట్లు దాదాపు 2,000 టన్నుల బరువుతో, గంటకు 30 నాట్ల వేగంతో ప్రయాణించగలవు. మన ఇండియన్ నేవీ సొంతంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ స్టెల్త్ డిజైన్, నవీన సాంకేతికతలతో ఇవి నిర్మాణం కానున్నాయి. శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఉండేలా రూపుదిద్దుకుంటున్న ఈ నౌకలు గాల్లో ఉన్న శత్రువులను, నీటిపైన ప్రయాణించే నౌకలను, అలాగే నీటి లోపల దాగి ఉండే జలఅంతర్గాములను (సబ్‌మెరైన్లు) ఎదుర్కొనే ఆల్ రౌండ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ఈ భారీ ప్రాజెక్ట్ విశేషమేమిటంటే.. ఇందులో 70 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని, వస్తువులనే ఉపయోగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘సాగర్’ (SAGAR) విజన్‌కు ఇది మరింత ఊతాన్ని ఇస్తుంది. రూ.40,000 కోట్లపైగా వ్యయంతో నిర్మించే ఈ నౌకల బాధ్యతను కోల్‌కతాకు చెందిన జిఆర్‌ఎస్‌ఈ, గోవా షిప్‌యార్డ్ పంచుకోనున్నాయి. దీనివల్ల ఈ రెండు దిగ్గజ షిప్‌యార్డ్‌ల ఆర్డర్ బుక్ బలోపేతం అవ్వడమే కాకుండా, మన దేశంలోని అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEలు) పనులు లభించి, వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక, ఈ యుద్ధనౌకల నిర్మాణ ప్రక్రియ ఏడాది లోపే ప్రారంభం కానుంది. ఇందులో మొదటి నౌకను 2030 నాటికి భారత నౌకాదళానికి అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో, సరిహద్దులను మరింత భద్రంగా ఉంచుకునేందుకు నేవీ తన బలగాలను నిరంతరం ఆధునికీకరిస్తోంది. ఇప్పటికే ఉన్న నీలగిరి-క్లాస్ ఫ్రిగేట్లు, కొత్త తరం డిస్ట్రాయర్లు, ఫ్లీట్ సపోర్ట్ షిప్‌ల శ్రేణికి ఈ కొత్త స్టెల్త్ కార్వెట్లు తోడైతే భారత నౌకాదళానికి సముద్రంపై తిరుగులేని శక్తి లభిస్తుంది.