Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..

Cinema Sequel

Cinema Sequel

Indian Cinema Sequel Trend: ఇప్పటివరకు కేవలం ఓటీటీ వెబ్ సిరీస్‌లకే సీజన్ల మీద సీజన్లు రావడం చూశాం. కానీ ఇప్పుడు వెండితెరపై కూడా సరిగ్గా అదే ట్రెండ్ కొనసాగుతోందని కనిపిస్తుంది. ఒక కథ బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే చాలు.. కేవలం రెండో భాగంతో సరిపెట్టకుండా పార్ట్ 3, పార్ట్ 4 అంటూ మన స్టార్ డైరెక్టర్లు భారీ ఫ్రాంచైజీలను ప్లాన్ చేస్తున్నారు. ఒక్కసారి కథ మొదలైతే ఇక ఆపేదే లేదంటూ రాబోతున్న ఆ క్రేజీ ప్రాజెక్టులు, సీక్వెల్స్ విశేషాలు ఒకసారి చూద్దామా..

సాధారణంగా ఓటీటీ కంటెంట్‌కు మాత్రమే నిరంతరం కొత్త సీజన్లు రావడం చూస్తుంటాము. అయితే మన దర్శకులు ఇప్పుడు పూర్తి స్థాయి సినిమాలను సైతం సుదీర్ఘ ఫ్రాంచైజీలుగా మారుస్తున్నారు. ఒక కథను రెండు భాగాలకే పరిమితం చేయకుండా.. ఏకంగా మూడు, నాలుగు భాగాల వరకు బలమైన కథాంశాలను సిద్ధం చేసుకుంటున్నారు.

తాజాగా విడుదలైన ‘జైలర్ 2’ క్లైమాక్స్‌లో విజయ్ సేతుపతి ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ సిరీస్‌లో ‘జైలర్ 3’ కూడా ఖాయమని దర్శకుడు నెల్సన్ హింట్ ఇవ్వకనే ఇచ్చారు. మరోవైపు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో నాలుగో భాగం తప్పకుండా ఉంటుందని దర్శకుడు జీతు జోసెఫ్ ఇప్పటికే స్పష్టం చేశారు. హిందీలో ఈ కథను ముగించినప్పటికీ.. మలయాళంలో మాత్రం ‘దృశ్యం 4’ రాబోతుంది.

మరోవైపు కన్నడ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించిన ‘కాంతార’ సిరీస్‌లో కూడా పార్ట్ 3 ఉంటుందని.. ప్రస్తుతం ఆ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నామని నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి స్వయంగా వెల్లడించారు. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ చిత్రాలకు సైతం పార్ట్ 3 ఉంటుందని ఆయా దర్శకులు ఎప్పుడో ప్రకటించారు. ప్రస్తుతం ఆ మేకర్స్ ఇతర భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ‘పుష్ప 3’, ‘కేజీఎఫ్ 3’ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయనే విషయంలో స్పష్టత లేనప్పటికీ, అవి కచ్చితంగా వస్తాయనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. ఇదివరకు హీరో సూర్య నటించిన యముడు సినిమా కూడా 3 పార్టీలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఒక్కసారి సక్సెస్ ఫార్ములా దొరికితే ఇక కథను ఆపకుండా ఫ్రాంచైజీలతో బాక్సాఫీస్‌ను ఏలడమే లక్ష్యంగా మన దర్శకులు ముందుకు సాగుతున్నారు.