Site icon NTV Telugu

Ind vs SA: రెండో వన్డేలో భారత్‌ ఘన విజయం.. సెంచరీతో చెలరేగిన శ్రేయస్ అయ్యర్

India Won

India Won

Ind vs SA: రాంచీ వేదికగా జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ప్రొటీస్‌ జట్టుపై గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 45.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. మొదట తడబడిన భారత్‌.. తర్వాత పుంజుకుంది. అజేయ సెంచరీ బాది శ్రేయస్ అయ్యర్‌ భారత విజయంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత 28 పరుగుల వద్దే శిఖర్‌ ధావన్, 48 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్‌ ఔట్ కావడంతో భారత్‌ కాస్త నిరాశ చెందినా.. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్‌, శ్రేయస్ అయ్యర్‌లు పరుగుల వరద పారించారు. అద్భుత ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషాన్ 93 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యి కాస్తలో సెంచరీని మిస్‌ చేసుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌ ఔటైనా క్రీజులో ఉన్న శ్రేయస్ అయ్యర్ సంజు శాంసన్‌తో కలిసి పని పూర్తి చేశాడు. శ్రేయస్ 111 బంతుల్లో 15 ఫోర్ల బాది.. మొత్తం 113 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జార్న్ ఫోర్టుయిన్, వేన్ పార్నెల్, కాగిసో రబాడలు తలో వికెట్‌ తీశారు. 43వ ఓవ‌ర్‌లో ర‌బ‌డా వేసిన రెండో బంతిని ఎక్స్‌ట్రా క‌వ‌ర్ మీదుగా బౌండ‌రీకి మ‌ళ్లించ‌డంతో శ్రేయ‌స్ అయ్యర్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ద‌క్షిణాఫ్రికాలో అడెన్ మార్‌క్రమ్ 79, రీజా హెండ్రిక్స్ 74 ప‌రుగులు చేసినా ఉప‌యోగం లేక‌పోయింది.

PM Narendra Modi: దేశంలో తొలి సోలార్‌ విలేజ్‌ను ప్రకటించిన ప్రధాని మోడీ

మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 278 పరుగులు చేసింది. తొలుత తడబడిన దక్షిణాఫ్రికా జట్టు 15 ఓవర్ల అనంతరం పుంజుకుంది. ప్రొటీస్ ఒక దశలో 2 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్‌క్రమ్ జట్టును ఆదుకున్నారు. ఇద్దరు అర్థశతకాలతో రెచ్చిపోవడంతో దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరును సాధించగలిగింది. వారిద్దరే 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోరు సాధించడంలో సఫలమయ్యారు. రీజా హెండ్రిక్స్ 74, ఎయిడెన్‌ మార్‌క్రమ్ 79 ప‌రుగుల‌తో జ‌ట్టును ఆదుకున్నారు. మహ్మద్ సిరాజ్ 10 ఓవర్లలో 38 పరుగులకు 3 వికెట్లతో ఆకట్టుకోగా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. 3 వన్డేల సిరీస్‌ను భారత్‌ 1-1తో సమం చేసింది. రెండు జట్లు తలో మ్యాచ్‌ విజయం సాధించడంతో మూడో వన్డే కీలకంగా మారింది.

Exit mobile version