NTV Telugu Site icon

Rohit Sharma: రోహిత్‌ శర్మ జైత్రయాత్ర.. 17 సిరీస్‌ల్లో వరుస విజయాలు!

Teamindia Test

Teamindia Test

India registers 17th consecutive Test series win on home soil: ద్వైపాక్షిక టెస్ట్‌ సిరీస్‌లలో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ జైత్రయాత్ర కొనసాగుతుంది. టెస్ట్ ఫార్మాట్‌ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రోహిత్‌కు ఇప్పటివరకు ఓటమనేది లేదు. ఇప్పటివరకు హిట్‌మ్యాన్‌ సారథ్యంలో భారత్ 5 టెస్ట్ సిరీస్‌లు ఆడగా.. ఒక్కటి కూడా కోల్పోలేదు. ఐదింటిలో 4 టెస్ట్ సిరీస్‌లు గెలవగా.. ఒకటి మాత్రం డ్రాగా ముగిసింది. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సారథ్యంలో కూడా భారత జట్టు అద్భుత టెస్ట్ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే.

కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ ప్రస్తానం 2021-22 శ్రీలంక సిరీస్‌తో మొదలైంది. స్వదేశంలో శ్రీలంకపై 2-0 తేడాతో భారత్ గెలిచింది. అనంతరం స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో సిరీస్ నెగ్గిన భారత్.. వెస్టిండీస్‌ గడ్డపై 1-0 తేడాతో గెలిచింది. ఆపై దక్షిణాఫ్రికా గడ్డపై 1-1తో డ్రాగా ముగించింది. తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌పై 3-1తో సిరీస్ నెగ్గింది. ఈ సిరీస్‌లో మరో టెస్ట్‌ మిగిలి ఉన్న విషయం తెలిసిందే. మొత్తానికి రోహిత్‌ శర్మ సారథ్యంలో టీమిండియా అద్భుత విజయాలు అందుకుంది. ఇక న్యూజీలాండ్, ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. రోహిత్ మరో మెట్టు ఎక్కుతాడు.

Also Read: IVPL 2024: క్రిస్‌ గేల్‌ 10 సిక్సర్లు బాదినా.. తెలంగాణకు తప్పని ఓటమి!

మరోవైపు స్వదేశంలో భారత్ విజయపరంపర 11 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో స్వదేశంలో రికార్డు స్థాయిలో 17 సిరీస్‌ల్లో వరుసగా విజయాలు సాధించింది. 2013 ఫిబ్రవరిలో మొదలైన జైత్రయాత్ర.. ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌ వరకు కొనసాగింది. ఏ జట్టు కూడా స్వదేశంలో వరుసగా ఇన్ని సిరీస్‌ల్లో వరుస విజయాలు సాధించలేదు. ఆస్ట్రేలియా రెండుసార్లు (1994-2001, 2004-2008) స్వదేశంలో వరుసగా 10 సిరీస్‌ల్లో విజయాలు అందుకుంది. వెస్టిండీస్‌ (1976-1986), న్యూజిలాండ్‌ (2017-2021) జట్లు సొంత గడ్డపై 8 సిరీస్‌ల్లో వరుసగా విజయాలు సాధించాయి.