భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ జరగనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. రాత్రి 8.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొనడం సవాలే. అందులోనూ ప్రొటీస్ సొంత గడ్డపై అంటే మాములు విషయం కాదు. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి సీనియర్లు టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా.. పెద్దగా అనుభవం లేని యువ జట్టు సఫారీలను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టులో ఎక్కువ మంది ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన ఆటగాళ్లే ఉన్నారు. టీ20 జట్టులో కుదురుకునే ప్రయత్నం చేస్తున్న యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే.. దక్షిణాఫ్రికా పిచ్‌లపై రాణిస్తే.. ప్రపంచంలో ఎక్కడైనా ఆడగలరు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లు ఇన్నింగ్స్ ఆరంభిస్తారు. ఈ ఇద్దరు తమదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. సూర్య, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ తర్వాతి స్థానాల్లో ఆడుతారు. కుర్రాళ్లు తడబడ్డా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాల్సిన బాధ్యత హార్దిక్, సూర్యల మీద ఉంది. అర్ష్‌దీప్‌తో కలిసి అవేష్, యశ్ దయాళ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అక్షర్, చక్రవర్తి స్పిన్ కోటాలో ఆడుతారు.
దక్షిణాఫ్రికా టీ20 జట్టు పటిష్టంగా ఉంది. మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్, మహరాజ్, రీజా హెండ్రిక్స్, స్టబ్స్ లాంటి సీనియర్లు ఉన్నారు. బౌలింగ్‌లో బార్ట్‌మన్, కొయెట్జీ, యాన్సెన్‌ల లాంటి యువ పేస్ బౌలర్లు ఉన్నారు. వీరిని ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు పెను సవాలే. కేశవ్‌డేంజరస్ స్పిన్నర్ అన్న విషయం తెలిసిందే. భారత్ బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటితేనే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. డర్బన్‌లో పిచ్ పేసర్లకు సహకరిస్తుంది. బంతి బాగా బౌన్స్ అవుతుంది. ఇక్కడ పేసర్లదే హవా.
Also Read: OTT Movies: మూవీ లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు!
తుది జట్లు (అంచనా):
భారత్: అభిషేక్, శాంసన్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్, రింకు, అక్షర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్, అవేష్ ఖాన్, యశ్ దయాళ్.
దక్షిణాఫ్రికా: రీజా, రికిల్‌టన్, మార్‌క్రమ్ (కెప్టెన్), క్లాసెన్, స్టబ్స్, మిల్లర్, యాన్సెన్, కేశవ్, ఎంగబా పీటర్, బార్ట్‌మన్, కొయెట్జీ.