India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..

India Vs Pakistan

India Vs Pakistan

India vs Pakistan: క్రికెట్ మైదానంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అనగానే అభిమానులలో ఎక్కడ లేని ఉత్సాహం ఉరకలేస్తుంది. అక్టోబర్ 30, శుక్రవారం రోజున హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నీలో ఇరు జట్లు తలపడనున్నాయి. హాంకాంగ్ సిక్సెస్ 2026 (Hong Kong Sixes 2026) 22వ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభం కానుండగా, తొలి రోజే (శుక్రవారం) చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నారు. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్ 2026 ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం సాధించి గోల్డ్ మెడల్ గెలుచుకున్న టీమిండియా, ఇప్పుడు మళ్లీ అదే ప్రత్యర్థితో ఢీకొట్టబోతోంది. ఈ టోర్నమెంట్‌లో భారత్ తరఫున కుర్రాళ్లతో కూడిన యంగ్ టీమ్ బరిలోకి దిగుతుండగా, రెండు జట్లూ గ్రూప్-సి లోనే ఉన్నాయి. దాంతో మరోసారి అభిమానులకు అసలైన క్రికెట్ మజా అందించేలా బ్లాక్‌బస్టర్ మ్యాచ్ ఖాయంగా కనిపిస్తోంది.

అసలు ఏమిటీ హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ?
ఈ టోర్నమెంట్ మనం క్రమం తప్పకుండా చూసే టీ20 క్రికెట్ ఫార్మాట్ కంటే పూర్తిగా భిన్నమైనది. మ్యాచ్ అత్యంత వేగంగా, క్షణక్షణానికి ఉత్కంఠగా సాగే 6 ఓవర్ల క్రికెట్ ఫార్మాట్ ఇది. ఇందులో ప్రతి జట్టులోనూ 11 మందికి బదులుగా కేవలం 6 మందే ఆటగాళ్లు ఉంటారు. ఇన్నింగ్స్‌కు 6 ఓవర్లు మాత్రమే కేటాయిస్తారు, అయితే ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం చెరో 8 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. బౌలింగ్ విషయానికొస్తే.. సాధారణంగా ఒక బౌలర్‌కు ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసే వెసులుబాటు ఉంటుంది. అయితే జట్టులోని ఒక ప్లేయర్‌కు మాత్రం వరుసగా కాకుండా, వేర్వేరుగా రెండు ఓవర్లు వేసే అవకాశం కల్పిస్తారు. మ్యూంగ్ కాక్‌లోని ‘మిషన్ రోడ్ గ్రౌండ్’ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 12 దేశాల జట్లు పోటీపడుతున్నాయి. అక్టోబర్ 30 నుంచి ప్రారంభమయ్యే ఈ పొట్టి టోర్నీ ఫైనల్ సమరం నవంబర్ 1న జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా, హాంకాంగ్ (చైనా), స్కాట్లాండ్, యూఏఈ, సౌతాఫ్రికా, ఒమన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌లతో పాటు భారత్, పాకిస్థాన్‌లు భాగమయ్యాయి.

ఈ మహాసమరం కోసం ఇరు దేశాలు తమ అత్యంత అనుభవజ్ఞులైన, విధ్వంసకర ఆటగాళ్లతో కూడిన బలమైన జట్లను ప్రకటించాయి. భారత జట్టు నాయకత్వాన్ని అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా చేతికి అప్పగించారు. ఈ జట్టులో విస్ఫోటక బ్యాటర్ శశాంక్ సింగ్, డేంజరస్ ఫినిషర్ రాహుల్ తెవాటియా, స్టైలిష్ బ్యాటర్ నితీష్ రాణా, అనుభవజ్ఞుడైన రాహుల్ త్రిపాఠి, పేస్ బౌలర్ టి. నటరాజన్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కుల్వంత్ ఖేజ్రోలియా సభ్యులుగా ఉన్నారు. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ జట్టుకు అబ్బాస్ అఫ్రిది కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడితో పాటు అబ్దుల్ సమద్, అహ్మద్ దానియల్, మొహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఖ్వాజా నఫే, మొహమ్మద్ షెహజాద్, సాద్ మసూద్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్ళు ఆ జట్టుకు బలంగ నిలవనున్నారు.