Site icon NTV Telugu

India Lok Sabha Seats Increase: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. 2029 ఎన్నికల నుంచే అమలు, తెలంగాణలో ఎన్ని పెరుగుతాయంటే?

India Lok Sabha Seats Increase

India Lok Sabha Seats Increase

India to Increase Lok Sabha and Assembly Seats by 50 Percent: దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీని ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలు 816కి పెరగనున్నాయి. ఇదే విధంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు కూడా 4,123 నుంచి 6,185కు పెరుగుతాయి.

ఈ ప్రతిపాదనలో భాగంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు గణనీయంగా పెరగనున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు.. అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరగనున్నాయి. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి.. అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు చేరే అవకాశం ఉంటుంది.

ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సోమవారం సాయంత్రం ఎన్డీయే సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వామపక్ష పార్టీలకు వెల్లడించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ల నేతృత్వంలో భేటీ జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా భేటీ జరిగింది. కాంగ్రెస్‌ పార్టీతోనూ అమిత్‌ షా మాట్లాడే అవకాశం ఉంది.

Also Read: Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు!

ఈ ప్రతిపాదనను అమలు చేయడానికి అవసరమైన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఈ బిల్లును ఆమోదింపజేయాలని కేంద్రం భావిస్తోంది. 2029 సాధారణ ఎన్నికల నుంచే ఈ కొత్త వ్యవస్థ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. జనాభా ఆధారంగా ప్రతినిధిత్వాన్ని పెంచడం, ప్రజల సమస్యలను మరింత సమర్థవంతంగా ప్రతిబింబించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

Exit mobile version