KL Rahul Fitness Test on September 4 at NCA: స్వదేశంలో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఆడే భారత జట్టుకు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపిక అవుతాడా? లేదా? అన్న అనుమానాలకు దాదాపుగా తెరపడినట్లే కనబడుతోంది. ప్రపంచకప్ జట్టులో రాహుల్‌కు చోటు ఖాయం అని తెలుస్తోంది. ఫిట్‌నెస్ విషయంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) పచ్చ జెండా ఊపడమే ఇందుకు కారణం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం (సెప్టెంబర్ 5) 15 మంది సభ్యుల ప్రపంచకప్ జట్టును ప్రకటించనుంది.
లోకేష్ రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో కోలుకుంటున్నాడు. ఆసియా కప్ 2023 కోసం శ్రీలంకకు వెళ్లే ముందు చివరి రౌండ్ ఫిట్‌నెస్ డ్రిల్స్‌లో రాహుల్ పాల్గొంటాడు. రాహుల్ 100 శాతం ఫిట్‌నెస్ సాదిస్తాడని ఎన్‌సీఏ ట్రెయినర్స్, జట్టు మేనేజ్‌మెంట్ ధీమాగా ఉందని తెలుస్తోంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ సెప్టెంబర్ 5న ప్రపంచకప్ కోసం భారత జట్టును ప్రకటించనుంది. ఇందుకోసం చీఫ్ సెలెక్టర్ అగార్కర్ శనివారమే పల్లెకెలె చేరుకున్నాడు. పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌లతో చర్చలు జరిపాడు.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
ప్రపంచకప్ 2023 కోసం భారత తుది జట్టుపై ఇప్పటికే బీసీసీఐ సెలెక్టర్లు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ మ్యాచ్‌లో 81 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ తొలి ప్రాధాన్య వికెట్ కీపర్‌గా జట్టులో స్థానం సంపాదించే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఉంటాడు. దాంతో సంజు శాంసన్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు ఉండదు. ప్రస్తుతం సంజూ ఆసియా కప్ 2023 కోసం రిజర్వ్ కీపర్‌గా శ్రీలంకలో ఉన్న సంగతి తెలిసిందే.