Anupama Singh: “మీరు పెంచిన భూతమే మిమ్మల్ని కాటేసింది”.. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..

India Slams Pakistan

India Slams Pakistan

Anupama Singh: ఐక్యరాజ్యసమితి (UN) వేదికగా భారత్ మరోసారి పాకిస్థాన్‌పై నిప్పులు చెరిగింది. కన్నతల్లిని మింగేసే రాక్షసుడిని (ఫ్రాంకెన్‌స్టైన్) సృష్టించి, ఇప్పుడు అదే రాక్షసుడు తనపై దాడి చేస్తుంటే విస్తుపోవడం పాకిస్థాన్‌కే చెల్లిందని భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఐరాస హైకమిషనర్ వార్షిక నివేదికపై జరిగిన ఇంటరాక్టివ్ డైలాగ్‌లో పాక్ ప్రతినిధి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తగా, భారత్ తన ‘రైట్ ఆఫ్ రిప్లై’ (సమాధానం చెప్పే హక్కు) ద్వారా ధీటైన కౌంటర్ ఇచ్చింది. ఐరాసలో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమా సింగ్ ఈ సందర్భంగా పాకిస్థాన్‌ ఉగ్రవాద విధానాలను, ద్వంద్వ ప్రమాణాలను ప్రపంచం ముందు ఎండగట్టారు. జమ్మూ కాశ్మీర్ అంశంపై భారత్ తన స్పష్టమైన, తిరుగులేని వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని అనుపమా సింగ్ నొక్కిచెప్పారు. ఈ విషయంలో ఇంకా ఏమైనా పరిష్కారం కాని సమస్య ఉందంటే.. అది పాకిస్థాన్‌ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాలు (POJK) మాత్రమేనని, వాటిని తిరిగి భారత్‌కు అప్పగించడమే ఏకైక మార్గమని తేల్చిచెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరుగుతున్న దారుణాలను, అక్కడి ప్రజలపై సాగుతున్న అణచివేతను ఆమె ప్రపంచానికి వివరించారు.

రవలాకోట్ ప్రాంతంలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలను ప్రస్తావిస్తూ.. వందలాది మంది పౌరుల హత్యలు, అక్కడి ప్రజలపై జరుగుతున్న క్రూరమైన అణచివేత.. బలవంతపు ఆక్రమణలతో కూడిన పాక్ వ్యవస్థకు నిదర్శనమని మండిపడ్డారు. రవలాకోట్‌లో జరిగిన ఘర్షణల్లో నలుగురు పోలీసులతో సహా 11 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. దశాబ్దాలుగా పాక్ సైన్యం సాగిస్తున్న భూకబ్లాలు, జనాభా మార్పిడి కుట్రలు, ప్రాథమిక హక్కుల నిరాకరణ కారణంగానే అక్కడ పరిస్థితులు ఇంతలా దిగజారాయని విమర్శించారు. కనీసం బతుకుదెరువు కోసం అన్నం, విద్యుత్, హక్కుల కోసం ప్రజలు అడుగుతుంటే.. పాక్ ప్రభుత్వం వారిపై బుల్లెట్లు, బ్రాటాలిటీతో సమాధానం ఇస్తోందని దుయ్యబట్టారు. అక్రమ, అపవిత్ర పాలనను కేవలం బలప్రయోగంతో మాత్రమే కొనసాగించగలరనే దానికి ఇదే నిదర్శనమని ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకున్న దేశం పాకిస్థాన్‌ అని భారత్ ఆరోపించింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, వారిని మోహరించడం తమ ప్రభుత్వ విధానమని స్వయంగా పాక్ రక్షణ మంత్రి బహిరంగంగానే గొప్పలు చెప్పుకుంటారని, అలాంటప్పుడు పాకిస్థాన్‌ తనను తాను ఉగ్రవాద బాధితురాలిగా ఎలా చెప్పుకుంటుందని నిలదీశారు. ఇదొక విచిత్రమైన వైరుధ్యమని, దీనిని ఒక్క పాకిస్థాన్‌ మాత్రమే సమర్థించుకోగలదని ఎద్దేవా చేశారు.

×
×
Ad

ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే దేశం.. పొరుగు దేశాలతో సత్సంబంధాలు, గుడ్‌విల్ ఆధారంగా నడిచే సింధు జలాల ఒప్పందం (Indus Water Treaty) వంటి సదుపాయాలను కోరడం అస్సలు నమ్మశక్యంగా లేదన్నారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన మరుసటి రోజే భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసిన సంగతిని ఆమె గుర్తుచేశారు. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్‌ల మధ్య కుదిరిన సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందం ఇప్పుడు కాలదోషం పట్టిందని భారత్ స్పష్టం చేసింది. ఆరు దశాబ్దాల క్రితం నాటి సాంకేతిక ఒప్పందాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చకుండా అలాగే ఉంచలేమని చెప్పారు. ఏనాడో 1960లో కుదిరిన ఒప్పందాన్ని ఎప్పటికీ హక్కుగా భావించడం కుదరదని, ప్రస్తుత ప్రపంచ వాస్తవాలకు, జవాబుదారీతనానికి లోబడి ఈ ఒప్పందంలో మార్పులు చేర్పులు అవసరమని, గత అరవై ఏళ్లలో వచ్చిన తీవ్రమైన మార్పులను పక్కనపెట్టి దీనిని కొనసాగించలేమని ఐరాస వేదికగా భారత్ అత్యంత స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది.