Piyush Goyal: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణం చూపి అగ్రరాజ్యం అమెరికా భారత్‌పై 50% సుంకాలను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 27 నుంచి ఈ సుంకాలు అమలు అవుతున్నాయి. ఈక్రమంలో అమెరికా భారత్‌పై 50 శాతం సుంకాన్ని విధించడంపై దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. తాజాగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ అమెరికా ప్రతీకార సుంకాలపై కీలక ప్రకటన విడుదల చేశారు. ఇండియా అమెరికన్ సుంకాలకు తలవంచబోదని స్పష్టం చేశారు. ఈ అత్యవరస పరిస్థితుల్లో తాము కొత్త మార్కెట్లను కనుగొంటామని, ఎగుమతులను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
READ ALSO: Kakani Govardhan Reddy: వీడియోలో ఉన్నది కోటంరెడ్డి మనుషులే..! ఈ కేసులో ఎవరిని ఇరికిస్తారో..?
స్వేచ్ఛా వాణిజ్యానికి సిద్ధం..
భారతదేశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అన్నారు. అయితే అమెరికా ఒత్తిడికి మాత్రం తలొగ్గదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలకు భారతదేశం “వంగి దండాలు పెట్టదు” దానికి బదులుగా కొత్త మార్కెట్లపై దృష్టిసారించి దేశీయ ఎగుమతులను పెంచుతుందన్నారు. ఈ సంవత్సరం దేశ ఎగుమతులు 2024-25 సంఖ్యను అధిగమిస్తాయని చెప్పారు. ప్రతి రంగానికి మద్దతు ఇవ్వడానికి, దేశ ఎగుమతులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో అనేక కొత్త ప్రకటనలు చేస్తుందని చెప్పారు. భారత్ ఎల్లప్పుడూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధంగా ఉంటుందని చెప్పారు.
ఇరుదేశాల సంబంధాలలో ఉద్రిక్తత..
ట్రంప్ ప్రతీకార సుంకాల దాడితో అమెరికా – భారత సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రతీకార సుంకాలను ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ట్రంప్ అమెరికా పరిధిని పెంచాలని చూస్తున్నారు. కానీ భారతదేశం – అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇప్పటివరకు విజయవంతం కాలేదు. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గబోమని భారత్ ప్రధాని మోడీ బహిరంగంగా చెప్పారు. ఈక్రమంలో ప్రధాని ‘స్వదేశీ’ ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడి ప్రతీకార సుంకాల నిర్ణయం రష్యాపై ఒత్తిడి తీసుకురాడానికే అని యూఎస్ అధికార యంత్రాంగం చెప్తుంది. ఈ ప్రతీకార సుంకాలతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపవచ్చని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ప్రతికార సుంకాలపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
READ ALSO: Anjali Raghav : భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ అనుచిత ప్రవర్తనపై.. స్పందించిన నటి
