Jaishankar: అమెరికా నావికాదళం చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు (సీమెన్) మరణించడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్‌లో మాట్లాడి, ఈ దాడులపై భారతదేశం తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వాణిజ్య నౌకలపై ఇలాంటి ప్రాణాంతక దాడులకు పాల్పడటం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా పంచుకున్నారు.
ఢిల్లీలో అమెరికా రాయబారికి రెండోసారి సమన్లు
ఈ దారుణ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా దూకుడు పెంచింది. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు నిరసనగా, న్యూఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్‌కు విదేశాంగ శాఖ రెండోసారి సమన్లు జారీ చేసి గట్టిగా నిలదీసింది. వాణిజ్య నౌకలపై దాడులు జరగడం తీవ్ర ఆందోళనకరం అని భారత్ పేర్కొంది.
అంతర్జాతీయ సమాజం ఆగ్రహం.. అమెరికాకు చురకలు
అమెరికా సైనిక చర్యపై ఐక్యరాజ్యసమితి (UN)తో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. అంతర్జాతీయ షిప్పింగ్ క్రమశిక్షణను పర్యవేక్షించే ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సంస్థ ‘ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్’ (IMO) ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. హార్మూజ్ జలసంధి సమీపంలో జరిగిన ఈ దాడిలో నౌకపై ప్రొజెక్టైల్ (క్షేపణి వంటిది) పడటంతో మంటలు వ్యాపించి ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారని ఐఎంఓ తెలిపింది. నావికుల ప్రాణాలకు, అంతర్జాతీయ షిప్పింగ్ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఎవరు వ్యవహరించినా అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఐఎంఓ సెక్రటరీ జనరల్ ఆర్సేనియో డొమింగ్యూజ్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సైతం ఐఎంఓ ప్రకటనతో ఏకీభవిస్తూ అమెరికా చర్యను తప్పుబట్టింది.
అసలేం జరిగింది?
కొద్దిరోజుల క్రితం ఒమన్ తీరానికి సమీపంలో ‘పలావు’ దేశ జెండాతో వెళ్తున్న ‘ఎమ్టీ సెటెబెల్లో’ (MT Settebello) అనే కమర్షియల్ ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా దళాలు దాడి చేశాయి. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వారిలో 21 మంది సురక్షితంగా బయటపడగా, ముగ్గురు నావికులు అదృశ్యమయ్యారు. తాజాగా వారు మరణించినట్లు నిర్ధారణ అయింది. మరణించిన భారతీయ నావికులను డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాలా సురేష్‌లుగా గుర్తించారు.
మరోవైపు ఈ దాడిపై అమెరికా సైన్యం వింత వాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న నౌకలపై విధించిన ఆంక్షల అమలులో భాగంగా తాము జారీ చేసిన ఆదేశాలను ‘ఎమ్టీ సెటెబెల్లో’ నౌక పాటించనందుకే దానిపై దాడి చేయాల్సి వచ్చిందని అమెరికా సమర్థించుకుంది. అయితే, అమెరికా వాదనను భారత్ తిప్పికొట్టింది. భారతీయ సిబ్బంది ఉన్న మర్చంట్ నౌకలపై ఇలాంటి దాడులు వెంటనే ఆగిపోవాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి దౌత్యపరమైన చర్చలు జరపాలని, ఈ ప్రాంతంలో త్వరగా శాంతి నెలకొనేలా చూడాలని కోరారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశ రక్షణ సంస్థలను హై అలర్ట్‌లో ఉంచింది. భారత నౌకాదళం (Indian Navy), అంతర్జాతీయ సముద్రయాన అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

