India Squad for Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆరంభానికి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉంది. టోర్నీ ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. తొలి మ్యాచ్ పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య జరగనుంది. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ ఉంది. ఆసియా కప్ కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ తమ జట్లను ప్రకటించగా.. భారత్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ టీమ్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్లేయర్స్ గాయాల కారణంగా బీసీసీఐ జట్టును ప్రకటించడంలో ఆలస్యం చేస్తోంది. ఆగష్టు 20లోగా భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది.
అయితే 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఇప్పటికే సెలక్ట్ చేసిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ జట్టులో గాయపడి కోలుకుంటున్న స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు ఫిట్‌నెస్ సాధించాల్సి ఉందట. ఈ జట్టులో టీ20 స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కలేదట. రాహుల్, అయ్యర్‌లలో ఎవరైనా ఫిట్‌నెస్ సాధించలేకపోతే.. సూర్యకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పరుగుల వరద పారించిన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు ఆసియా కప్ 2023 కోసం పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. ఒక్క సిరీస్ ప్రదర్శనతో అతడికి మెగా ఈవెంట్‌లో ఛాన్స్ ఇవ్వడంపై సరికాదని సెలెక్షన్ కమిటీ భావిస్తోందట. అయితే ముకేశ్ కుమార్‌ను మాత్రం ఆసియా కప్ 2023కోసం ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. భారత పేస్ దళం పటిష్టం చేయడం కోసమే అతడిని ఛాన్స్ ఇవ్వనున్నారట.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమాన్ గిల్.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడతాడు. కీలక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదవ స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనున్నారు. వీరికి బ్యాకప్‌గా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ తుది జట్టులో ఉంటారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఆల్ రౌండర్లుగా ఉంటారు. స్పిన్నర్లుగా యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్.. పేస్ విభాగంలో మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దల్ ఠాకూర్, ముకేశ్ కుమార్ ఉండనున్నారు.
Also Read: Asia Cup 2023: ఆసియా కప్ 2023కు కేఎల్ రాహుల్ వద్దు.. రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దల్ ఠాకూర్, ముకేశ్ కుమార్.