IND vs BAN 1st Test: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్టు సిరీస్‌కు రంగం సిద్దమైంది. గురువారం చెన్నైలో మొదటి టెస్ట్ ఆరంభం కానుంది. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న టీమిండియా.. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత జట్టులోకి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చారు. ఆకాశ్ దీప్, యశ్ దయాల్ కూడా టీమ్‌కు ఎంపికయ్యారు. దాంతో తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఫస్ట్ డౌన్‌లో శుభ్‌మన్ గిల్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడతారు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ 5,6 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారు. రాహుల్, పంత్ రీఎంట్రీతో ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ జట్టుపై అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నారు. సీనియర్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ 7, 8వ స్థానంలో బరిలోకి దిగనున్నారు. చెపాక్ పిచ్ స్పిన్‌కు స్వర్గధామం కాబట్టి మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కుతుంది. అక్షర్ పటేల్‌కు నిరాశ తప్పదు.
పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఆడనున్నారు. ఒకవేళ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే.. యశ్ దయాల్ తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు కుల్దీప్ యాదవ్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించినా.. మరీ బంతి గింగిరాలు తిరిగేలా మాత్రం ఉండకపోవచ్చని సమాచారం. మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్నర్ల ప్రభావం పెరుగుతుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్/యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.