India – Pakistan: మొదట భారత్ తరఫున ఆడి.. ఆ తర్వాత పాకిస్థాన్‌ తరఫున ఆడిన క్రికెటర్లు వీరే..!

  • క్రికెట్‌పైనా 1947లో భారత్‌-పాకిస్థాన్ విభజన ప్రభావం..
  • విభజనకు ముందు భారత్ తరఫున టెస్టులు..
  • ఆ తర్వాత పాకిస్థాన్‌ తరఫున ఆడిన వైనం..
India Pakistan

India Pakistan

India – Pakistan: 1947 ఆగస్టు 14 & 15.. భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజులు. బ్రిటిష్ పాలన ముగిసిన సమయంలో భారత్‌, పాకిస్థాన్ విభజన జరిగింది. ఈ విభజన కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా.. కోట్లాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వలస వెళ్లాల్సి వచ్చింది. ఈ ప్రభావం క్రీడా రంగంపైనా పడిందని చాలా మందికి తెలియదు. ముఖ్యంగా అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న క్రికెట్‌ లోనూ ఆటగాళ్లు కొత్తగా ఏర్పడిన దేశాలకు తరలి వెళ్లవలిసి వచ్చింది.

విభజనకు ముందు భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కొందరు ఆటగాళ్లు ఆ తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లి ఆ దేశం తరఫున కూడా క్రికెట్ ఆడారు. భారత్, పాకిస్థాన్‌ రెండు దేశాల తరఫున టెస్టు క్రికెట్ ఆడిన ఆటగాళ్లు ముగ్గురు మాత్రమే. మరి వారెవరో.. వారి వివరాలేంటో తెలుసుకుందామా..

అబ్దుల్ హఫీజ్ కర్దార్:

భారత్ తరఫున ఆడిన తర్వాత పాకిస్థాన్‌ను ఎంచుకున్న క్రికెటర్లలో అబ్దుల్ హఫీజ్ కర్దార్ ప్రముఖుడు. 1946లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆయన భారత్ తరఫున మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఇక పాకిస్థాన్ భారత్ నుండి విడిపోయిన తర్వాత కర్దార్ పాకిస్థాన్‌ను ఎంచుకున్నారు. ఆయన జన్మస్థలం లాహోర్ అప్పట్లో అవిభక్త పంజాబ్‌లో ఉండగా, విభజన తర్వాత పాకిస్థాన్‌లో భాగమైంది. దానితో కొత్తగా ఏర్పడిన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కర్దార్ కెప్టెన్‌గా వ్యవహరించారు. దీంతో పాకిస్థాన్ తొలి టెస్టు కెప్టెన్‌గా కూడా చరిత్రలో నిలిచిపోయారు. కర్దార్ తన కెరీర్‌లో మొత్తం 26 టెస్టులు ఆడగా, అందులో 23 మ్యాచ్‌లు పాకిస్థాన్ తరఫునే ఆడారు. పాకిస్థాన్ తరఫున ఆయన 927 పరుగులు సాధించారు.

ఆమిర్ ఎలాహి:

భారత్, పాకిస్థాన్ రెండు దేశాల తరఫున టెస్టు క్రికెట్ ఆడిన మరో ఆటగాడు ఆమిర్ ఎలాహి. ఈయన 1947లో పాకిస్థాన్ ఏర్పడటానికి కొద్దికాలం ముందు భారత్ తరఫున ఒక టెస్టు మ్యాచ్ ఆడారు. విభజన అనంతరం ఎలాహి పాకిస్థాన్ జట్టులో చేరారు. 1952లో భారత్‌తో జరిగిన పాకిస్థాన్ తొలి టెస్టు సిరీస్‌లో ఆ దేశం తరఫున మళ్లీ టెస్టు క్రికెట్ ఆడారు. మొత్తం 6 టెస్టులు ఆడిన ఎలాహి 82 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు పడగొట్టారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం ఆయనకు మంచి రికార్డు ఉంది. 125 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 5,000కు పైగా పరుగులు సాధించడంతో పాటు 500కు పైగా వికెట్లు పడగొట్టారు.

గుల్ మహమ్మద్:

గుల్ మహమ్మద్ భారత్, పాకిస్థాన్ రెండు దేశాల తరఫున టెస్టు క్రికెట్ ఆడిన మరో ఆటగాడు. అంతేకాదు.. భారత్ తరఫున ఎక్కువ టెస్టులు ఆడి, పాకిస్థాన్ తరఫున కేవలం ఒక టెస్టు మాత్రమే ఆడిన ఏకైక క్రికెటర్‌గా ఆయన నిలిచారు. 1946లో భారత్ తరఫున టెస్టు అరంగేట్రం చేసిన గుల్ మహమ్మద్, విభజన తర్వాత కూడా కొంతకాలం భారత జట్టులో కొనసాగారు. 1952 వరకు భారత్ తరఫున క్రికెట్ ఆడిన ఆయన 1956లో పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అదే ఏడాది పాకిస్థాన్ తరఫున తన ఒక టెస్టు మ్యాచ్ ఆడారు. ఆయన మొత్తం 9 టెస్టుల్లో భారత్ తరఫున 8, పాకిస్థాన్ తరఫున ఒక మ్యాచ్ ఆడారు. మొత్తంగా 205 పరుగులు సాధించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 118 మ్యాచ్‌లు ఆడి 5,000కు పైగా పరుగులు చేయడంతో పాటు 100కు పైగా వికెట్లు తీసుకున్నారు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కూడా..

విభజనకు ముందు భారతదేశంలోని రంజీ ట్రోఫీ వంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆడిన పలువురు క్రికెటర్లు ఆ తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లారు. వారిలో ఫజల్ మహమూద్ ప్రముఖుడు. ఆయన ఉత్తర భారతదేశం, పంజాబ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి, విభజన అనంతరం పాకిస్థాన్ తరఫున టెస్టు అరంగేట్రం చేశారు. ఫజల్ మహమూద్ పాకిస్థాన్ క్రికెట్‌లో గొప్ప ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు ఉంది. ఆయన 34 టెస్టు మ్యాచ్‌ల్లో 139 వికెట్లు పడగొట్టారు. అలాగే నజర్ మహమ్మద్, ఇంతియాజ్ అహ్మద్, మహమ్మద్ నిసార్ వంటి పలువురు క్రికెటర్లు కూడా విభజనకు ముందు భారతదేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడి, ఆ తర్వాత పాకిస్థాన్ తరఫున టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశారు.