Republic Day 2024: వచ్చే ఏడాది జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఇండియా ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఆహ్వానం పంపింది. భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించగా.. ఆయన కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఆహ్వానం పంపింది. అనుకున్న ప్రకారం జరిగితే ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ జనవరి 26న భారత్‌కు రానున్నారు. ఇప్పటివరకు ఐదుగురు ఫ్రెంచ్ నేతలు రిపబ్లిక్ వేడుకలకు హాజరు కాగా.. మాక్రాన్ వస్తే ఈ వేడుకలకు హాజరైన ఆరో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా నిలవనున్నారు.
Read Also: Covid Outbreak: 3 వేల మార్క్‌కు దగ్గరగా యాక్టివ్ కేసులు.. అప్రమత్రంగా ఉండాలని కేంద్రం సూచన
ప్రధాని మోదీ జులైలో ఫ్రాన్స్‌ను సందర్శించిన సంగతి తెలిసిందే. పారిస్‌లో జరిగిన బాస్టిల్ డే (ఫ్రెంచ్ జాతీయ దినోత్సవం) వేడుకలకు గౌరవ అతిథిగా హాజరైన తర్వాత ఈ పరిణామం జరిగింది. బాస్టిల్ డే 1789లో ఫ్రెంచ్ విప్లవం సమయంలో బాస్టిల్ జైలుపై దాడి చేసిన జ్ఞాపకార్థం. సెప్టెంబరులో మాక్రాన్ భారతదేశం నిర్వహించిన G20 సమ్మిట్ కోసం ఢిల్లీని సందర్శించి, ప్రధాని మోడీతో చర్చలు జరిపారు. సమావేశం తరువాత ప్రధాని మోడీ మాక్రాన్‌తో.. భారతదేశం-ఫ్రాన్స్ సంబంధాల పురోగతి కొత్త శిఖరాలను తాకేలా తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ ఎల్-సిసి భారత గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం భారతదేశం తన గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాలని విదేశీ నాయకులను ఆహ్వానిస్తుంది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా 2021, 2022 రెండేళ్ల పాటు రిపబ్లిక్ డే ముఖ్య అతిథిని ఆహ్వానించలేదు. కేవలం ఈ రెండు సందర్భాల్లో మాత్రమే అతిథిని ఆహ్వానించలేదు.
