దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు సడలిస్తుండటంతో గత నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరిలో మొత్తం 1,33,026 కోట్ల వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే 18 శాతం అధికంగా రూ.1.33 లక్షల కోట్ల రాబడి వచ్చింది. ఒక నెలలో రూ.1.30 లక్ష కోట్ల మార్కు దాటడం జీఎస్‌టీ చరిత్రలో ఇది ఐదోసారి. మొత్తం నమోదైన వసూళ్లలో సీజీఎస్‌టీ ద్వారా రూ.24,435 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ ద్వారా రూ.30,779 కోట్లు, ఐజీఎస్‌టీ ద్వారా రూ.67,471 కోట్లు వచ్చాయి.
మరోవైపు దిగుమతుల ద్వారా రూ.33,837 కోట్లు, సెస్ రూపంలో రూ.10,340 కోట్లు వచ్చాయి. సెస్ రూ.10 వేల కోట్లు దాటడం ఇదే తొలిసారి. అయితే ఈ ఏడాది జనవరి నెలతో వసూళ్లతో పోల్చితే ఫిబ్రవరిలో స్వల్పంగా జీఎస్టీ వసూళ్లలో తగ్గుదల కనిపించింది. సాధారణంగా ఫిబ్రవరిలో 28 రోజులే ఉండటంతో జనవరి కన్నా తక్కువ జీఎస్‌టీ రాబడి ఉంటుంది. 2022 జనవరిలో రూ.1.40,986 కోట్ల వసూళ్లు వచ్చాయి. జీఎస్టీ ప్రవేశపెట్టాక ఈ ఏడాది జనవరి నెల వసూళ్లే రికార్డు.