Site icon NTV Telugu

India vs Pakistan: పాకిస్థాన్ కు నీటిని ఆపేసిన భారత్..

Ravi Water

Ravi Water

Ravi river water flow: పాకిస్థాన్‌ దేశానికి భారతదేశం మరో షాక్ ఇచ్చింది. రావి నది జలాలను పూర్తిగా నిలిపి వేసినట్లు సమాచారం. అయితే, దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న షాపుర్‌ కండీ ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడమే దీనికి ప్రధాన కారణం. ఈ తాజా పరిణామంతో రావి జలాలన్నీ మన దేశానికే ఉపయోగపడబోతున్నాయి. 1960లో ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో భారత్‌- పాక్‌ల మధ్య సింధూ జలాల ఒప్పందం జరిగింది. దాని ప్రకారం- సింధూ ఉపనది అయిన రావి జలాలపై పూర్తి హక్కులు భారత్ కు లభించాయి. దీంతో ఈ నది నుంచి పాకిస్థాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసేందుకు ఆనకట్టలు నిర్మించాలని గతంలో ఇండియా నిర్ణయించింది.

Read Also: Egypt: నైలు నదిలో మునిగిన బోటు.. 19 మంది కూలీలు మృతి

అందులో భాగంగానే 1979లో పంజాబ్‌- జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది. రావి నదిపై ఎగువ వైపు రంజిత్‌ సాగర్‌ డ్యామ్‌, కింది వైపు షాపుర్‌ కండీ బ్యారేజ్‌ను నిర్మించాలని ఈ రెండు రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. రంజిత్‌ సాగర్‌ డ్యామ్‌ నిర్మాణం 2001లోనే పూర్తి కాగా, షాపుర్‌ కండీ పనులు అనేక ఆటంకాలతో ఆగిపోయాయి. దీంతో పాక్‌కు నీటి ప్రవాహం కొనసాగుతూ వచ్చింది. అయితే, 2008లో షాపుర్‌ కండీ బ్యారేజీని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి.. 2013లో నిర్మాణ పనులు ఆరంభించారు. కానీ, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌ల మధ్య విభేదాలతో ఏడాదికే మళ్లీ పనులు నిలిచిపోయాయి.

Read Also: TSPSC Group 1: తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు ఖరారు.. ఎప్పుడంటే..?

ఇక, చివరకు 2018లో కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం చేయడంతో షాపుర్ కండీ బ్యారేజీ నిర్మాణం తిరిగి మొదలైంది. ఎట్టకేలకు ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 25 నుంచి నుంచి పాకిస్థాన్ కు నీటి ప్రవాహాన్ని నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో 55.5 మీటర్ల ఎత్తైన షాపుర్‌ కండీ ఆనకట్ట నిర్మాణం పూర్తి కావడంతో.. ఇన్నాళ్ల పాటు పాక్‌కు వెళ్లిన నీటిని ఇప్పుడు జమ్మూ కశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాలకు మళ్లీస్తున్నారు.

Exit mobile version