INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!

  • ఎన్నికల సంఘానికి ఇండియా కూటమి 48 ప్రశ్నలు..
  • సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు..
Cec

Cec

INDIA Bloc: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రక్రియకు ఆమోదం ఎలా లభించింది.? ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయా?, ఓటర్ల డేటా, ECINET వ్యవస్థ, ఫారం-6 దరఖాస్తుల నిర్వహణలో ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారు? వంటి అంశాలపై వివరణ కోరుతూ 48 ప్రశ్నల్ని సమర్పించింది.

సోమవారం దాఖలైన పిటిషన్‌లో ఎన్నికల సంగం వాస్తవాలు, ఆధార పత్రాలను కోర్టు ముందు ఉంచకుండా కొన్ని వాదనల్ని మాత్రమే వినిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎస్ఐఆర్‌కు సంబంధించి కీలక అంశాలపై అధికారిక రికార్డులతో కూడిన సమాధానాలు పొందడానికి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడం అవసరమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నిలక సంఘం చెబుతున్న వాదనల్ని ధ్రువీకరించుకోవడమే తమ ప్రశ్నల ఉద్దేశమని చెప్పారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ ఇండియా కూటమి దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం విచారణ జరగనుంది.

ప్రధాన ప్రశ్నలు ఇవే..

దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) నిర్వహించడానికి నిర్ణయం ఎలా తీసుకున్నారు.? దానికి ఎవరి ఆమోదం తెలిపారు? ఎన్నికల సంఘంలోని అందరు సభ్యులు ఏకాభిప్రాయంగా నిర్ణయం తీసుకున్నారా? లేక ఎవరైనా అభ్యంతరం చెప్పారా? అనే వివరాలను విపక్షాలు కోరుతున్నాయి. ఇదే సమయంలో ఎన్నికల సంఘంలోని కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయా? అనే అంశాన్ని కూడా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం నిర్ణయాల్లో మెజారిటీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నారా? అని ప్రశ్నిస్తున్నాయి.

ఓటర్ల డేటా బేస్‌ను ఎవరు యాక్సెస్ చేయగలరు.? ఓటర్ల వివరాలను చేర్చడం, తొలగించడం, సవరించడం లేదా తిరిగి పునరుద్ధరించడం వంటి మార్పులకు ఎవరు అనుమతి ఉంది? అనే అంశాలను విపక్షాలు కోరుతున్నాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు ఓటర్ల డేటాలో మార్పులు చేసే అధికారం లేదా ప్రత్యేక యాక్సెస్ ఇచ్చారా? అనే ప్రశ్నను లేవనెత్తుతోంది.

ఫారం-6పై ప్రశ్నలు..

కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6 ప్రక్రియలో చేసిన మార్పులపై ఇండియా కూటమి ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా ఫారం-6లో కొత్తగా ప్రవేశపెట్టిన డిక్లరేషన్‌కు సంబంధించిన వివరాలను కోరింది. ఈ డిక్లరేషన్ లేదా మ్యాపింగ్ వివరాలు సమర్పించకపోవడం వల్ల ఎన్ని అప్లికేషన్లను తిరస్కరించారు? ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచారు? అనే వివరాలను కోరింది.

పశ్చిమ బెంగాల్‌లో న్యాయాధికారులు ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చాలని ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్నికల సంఘం తరఫున దాఖలైన అప్పీళ్ల అంశాన్ని కూడా విపక్షాలు ప్రస్తావించాయి.ఇలాంటి ఉత్తర్వులపై మొత్తం ఎన్ని అప్పీళ్లు దాఖలయ్యాయి? వాటిని దాఖలు చేయడానికి ఏ అధికారులు అనుమతి ఇచ్చారు? ఏ కేసుల్లో అప్పీళ్లు వేయాలన్నది నిర్ణయించేందుకు ఎలాంటి ప్రమాణాలు అనుసరించారు? అనే వివరాలు కోరాయి.