Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉప ఎన్నికలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే బై ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు అందరూ తమ పార్టీ ఎన్నికల గుర్తు ‘సైకిల్’పైనే పోటీ చేస్తారని వెల్లడించారు. కూటమి నిర్ణయాన్ని సీట్ల పంపకానికి సంబంధించిన విషయమేమీ తెలియదు.. విజయం సాధించడం ఒకటే కీలకమని పేర్కొన్నారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఐక్యంగా ముందుకు వెళ్తున్నాయి.. భారీ విజయం కోసం తాము కలిసి పోరాటం చేస్తున్నాం.. ఈ ఉప ఎన్నికలో ఇండియా కూటమి విజయం కొత్త అధ్యాయాన్ని లిఖించబోతుందన్నారు. అందరి మద్దతుతో ఉప ఎన్నికలో అన్ని సీట్లలో గెలుస్తామని అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: R Ashwin Record: చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా రికార్డు!
ఇక, నవంబరు 13వ తేదీన ఘజియాబాద్, మఝవాన్ (మీర్జాపూర్), సిసమావు (కాన్పూర్ సిటి), ఖైర్ (అలీఘర్), ఫుల్‌పూర్ (ప్రయాగ్ రాజ్), కతేహరి (అంబేద్కర్ నగర్), కర్హల్ (మెయిన్‌పురి), మీరాపూర్ (ముజఫర్‌నగర్), కుందర్కి (మొరాదాబాద్) స్థానాలకు బైపోల్ జరగనున్నాయి. అయితే, 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచారు. వారి స్థానంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇకపోతే, క్రిమినల్ కేసులో దోషిగా తేలిన సమాజ్ వాదీ ఎమ్మెల్యే ఇర్ఫాన్ సోలంకిపై అనర్హత వేటు పడటంతో సిసమావు స్థానానికి సైతం బైఎలక్షన్స్ జరగబోతుంది. అయితే, పది అసెంబ్లీ స్థానాల్లో ఐదు సీట్లను కాంగ్రెస్ డిమాండ్ చేయగా.. ఘజియాబాద్, ఖైర్ (అలీఘర్) రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఒప్పుకుంది. మిగిలిన స్థానాలను సమాజ్ వాది పార్టీకి వదిలివేసినట్లు వార్తలు వచ్చాయి. మిల్కీపూర్ (అయోధ్య)ని పక్కన బెట్టి తొమ్మిది స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఇక, నవంబర్ 13న ఓటింగ్ జరగనుండగా.. 23వ తేదీన ఓట్ల లెక్కింపు జరగబోతుంది.