Asian Games 2026: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్‌లో భారత్ అదరగొట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్‌లో టీమిండియా 114 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది.
భారత్ భారీ స్కోరు సాధించడంలో షఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన షఫాలీ 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఆమె 204.08 స్ట్రైక్‌రేట్‌తో 3 ఫోర్లు, ఏకంగా 9 సిక్సర్లు బాధింది. మరోవైపు ఓపెనర్ స్మృతి మంధాన 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసింది. ఇంకా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 33 బంతుల్లో 40 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో భారతి ఫుల్మాలి 5 బంతుల్లో 9 పరుగులు చేయడంతో భారత్ 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.
196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్ దిలారా అక్తర్ 23 బంతుల్లో 27 పరుగులు చేయగా.. సుల్తానా ఖాతూన్ 8 బంతుల్లో 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో నందని శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసింది. 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ కూడా 2.4 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది. శ్రీ చరణి 3 ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్‌ను దెబ్బతీశారు.
భారత్ విజయం సాధించడంతో ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్ ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన శ్రీలంక ఇప్పటికే ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. దీంతో స్వర్ణ పతకం కోసం భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
𝙄𝙉𝙏𝙊 𝙏𝙃𝙀 𝙁𝙄𝙉𝘼𝙇 ✌️
A dominant 1⃣1⃣4⃣-run victory for #TeamIndia 💥
They are all set to face Sri Lanka next in the Gold Medal match 🏅⏳
Scorecard ▶️ https://t.co/zMJKYRAVhE#AsianGames pic.twitter.com/ZIi2hTFv3A
— BCCI Women (@BCCIWomen) September 20, 2026

