NTV Telugu Site icon

World Archery Championships 2023: విల్లు ఎక్కుబెట్టిన తెలుగమ్మాయి.. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం!

India Archery Gold Medal

India Archery Gold Medal

India wins first gold medal in World Archery Championships: ఎట్టకేలకు భారత్‌ ఆర్చరీ ‘పసిడి’ కల నెరవేరింది. ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న స్వర్ణ పతకం భారత్ ఖాతాలో చేరింది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ, మహారాష్ట్ర అమ్మాయి అదితి స్వామి మరియు పంజాబ్‌ ప్లేయర్ పర్ణీత్‌ కౌర్‌ త్రయం గురి.. దేశానికి తొలి స్వర్ణం అందించింది. ఏ విభాగంలో అయినా దేశానికి ఇదే తొలి పసిడి. బెర్లిన్‌లో శుక్రవారం జరిగిన కాంపౌండ్‌ మహిళల జట్టు విభాగం ఫైనల్లో రెండో సీడ్‌ భారత జట్టు 235-229 తేడాతో టాప్‌ సీడ్‌ మెక్సికోపై గెలిచింది.

తమకంటే బలమైన జట్లను ఓడిస్తూ ఫైనల్ దూసుకెళ్లిన భారత అమ్మాయిలు.. తుది పోరులోనూ అదే జోరు కొనసాగించారు. ప్రత్యర్థి మెక్సికో పటిష్ఠంగా ఉన్నా.. గాలి తీవ్రత అధికంగా ఉన్నా.. ఏ మాత్రం పట్టు వదలకుండా అద్భుత ఆటతో స్వర్ణం గెలిచారు. డాఫ్ని క్వింటెరో, అనా సోఫియా హెర్నాండెజ్‌, ఆండ్రియా బెసెరాలతో కూడిన మెక్సికో జట్టుపై భారత అమ్మాయిలు తొలి రౌండ్‌ నుంచే ఆధిపత్యం చెలాయించారు. తొలి రౌండ్‌లో 60కి 59 స్కోరు చేశారు. 2, 3 రౌండ్లలోనూ 59 చొప్పున పాయింట్లు సాధించిన భారత అమ్మాయిలు.. చివరి రౌండ్‌కు ముందు 177-172తో ఆధిక్యంలో నిలిచారు.

చివరి రౌండ్‌ చివరి సెట్‌కు ముందు భారత్‌ 207-199తో ముందంజలో నిలిచింది. చివరి సెట్‌లో మెక్సికో ఆర్చర్లు ముగ్గురు పదేసి చొప్పున పాయింట్లు సాధించడంతో స్కోరు 237కు చేరింది. ఆ దశలో భారత అమ్మాయిలు పర్ణీత్‌ 10 పాయింట్లు సాధించగా.. అదితి 9 పాయింట్లు సాధించింది. ఇక మరో 5 పాయింట్లు గెలిస్తే భారత్‌ ఖాతాలో స్వర్ణం చేరుతుంది. ఈ సమయంలో బాణం చెరపట్టిన తెలుగమ్మాయి సురేఖ 9 పాయింట్లు సాధించింది. దీంతో భారత్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.

2017, 2021 ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లలో ఫైనల్‌ చేరిన భారత జట్టు రజత పతకాలతో సరిపెట్టుకుంది. ఈసారి మాత్రం స్వర్ణం నెగ్గి భారత జెండాను రెపరెపలాడించారు. ప్రపంచ సీనియర్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌ 12 పతకాలు నెగ్గింది. ఇందులో 1 స్వర్ణం, 9 రజతాలు, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇక మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ విభాగం క్వార్టర్స్‌లో నేడు సహచర ఆర్చర్‌ పర్ణీత్‌తోనే జ్యోతి పోటీ పడనుంది.

Show comments