Mallikarjun Kharge: ‘ఇది అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం’.. డీలిమిటేషన్ బిల్లుపై మల్లికార్జున ఖర్గే ఫైర్..

Mallikarjunkharge

Mallikarjunkharge

Mallikarjun Kharge: నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియ ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అని, ఇది కేవలం అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల (Parliament Special Session) నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ఇండియా కూటమి (INDIA Alliance) నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్గే, ఈ పునర్విభజన బిల్లులో ఎస్సీ, ఎస్టీల (SC-ST) ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని, వారికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు (Women’s Reservation) సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై (Constitutional Amendment Bill) అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష నేతలు ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్‌లతో పాటు వివిధ పార్టీల అగ్రనేతలు పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) తరపున అభిషేక్ బెనర్జీ, ఆర్జేడీ (RJD) నుంచి మనోజ్ ఝా, అభయ్ కుమార్ సింగ్, స్వతంత్ర రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్, సీపీఐ (CPI) నేత పి. సంతోష్ కుమార్, ఐయూఎంఎల్ (IUML) నేత ఇ.టి. మహ్మద్ బషీర్, ఆర్ఎస్పీ (RSP) ఎంపీ ఎన్.కె. ప్రేమచంద్రన్ తదితరులు హాజరయ్యారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీజేడీ (BJD), డీఎంకే (DMK) పార్టీలకు కూడా ఈ సమావేశానికి ఆహ్వానం అందింది.

అయితే, ఈ కీలక సమావేశానికి ఎన్సీపీ శరద్ పవార్ వర్గం (NCP – SP) దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శరద్ పవార్ ఆరోగ్య కారణాల రీత్యా తాను సోమవారం ఢిల్లీకి వెళ్తున్నానని, అయితే ఈ సమావేశానికి తమ పార్టీ నుంచి ఇతర నేతలు హాజరవుతారని ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) శుక్రవారం ప్రకటించారు. కానీ, చివరి నిమిషంలో ఆ పార్టీ నుంచి ఎవరూ ఈ భేటీకి హాజరుకాలేదని సమాచారం. మరోవైపు, ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే (DMK) ఈ విషయంలో భిన్నమైన వైఖరిని ప్రకటించింది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్లు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ (M.K. Stalin) స్పష్టం చేశారు. నిష్పక్షపాతమైన పునర్విభజన (Fair Delimitation) కోసం తాము చేసిన డిమాండ్లను ఈ బిల్లులో చేర్చారని, అందుకే ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు తమ పార్టీ మద్దతు తెలుపుతోందని స్టాలిన్ వెల్లడించారు. దీంతో ఈ బిల్లు విషయంలో విపక్ష కూటమిలోని పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.