INDIA Alliance: పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి, మోడీ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది అంటూ విపక్ష పార్టీ నేతలు తెలిపారు. బీజేపీ ఎంపీ ఇచ్చిన సిఫార్సు లేఖ ద్వారా ఈ నెల 13న లోక్‌సభ గ్యాలరీలోకి కొందరు అగంతకులు సందర్శకులుగా ప్రవేశించి, పొగబాంబులు వదిలి అలజడి సృష్టించారు. ఈ దుర్ఘటన భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ఎంపీలు డిమాండ్ చేయడమే నేరంగా పరిగణించిన మోడీ సర్కార్ ఉభయ సభల నుంచి ఆయా ఎంపీలను బహిష్కరించింది. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానానికి పరాకాష్ట అని ఇండియా కూటమి నేతలు విమర్శలు గుప్పించారు.
Read Also: Tirumala: వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి.. టోకెన్లు ఇచ్చేది ఈ కేంద్రాల్లోనే..
అయితే, పార్లమెంట్ నుంచి 146 మంది పార్లమెంట్ సభ్యులను స్పీకర్ ఓంబిర్లా సస్పెండ్ చేశారు. దీంతో ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఇండియా కూటమి పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వామపక్షాలు, కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు ప్రకటించాయి. ఇటు తెలంగాణలో కూడా ‘ఇండియా’ కూటమి పార్టీల నేతృత్వంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు దగ్గర భారీ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాట పలువురు మంత్రులు కూడా పాల్గొంటారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ‘ఇండియా’ కూటమి పిలుపులో భాగంగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.