Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. బోర్డుపై భారత్ స్కోర్ 900 పరుగులు..

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

శ్రీలంకలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దంబుల్లా వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ఈ కీలక పోరులో టాస్ గెలిచిన ప్రత్యర్థి జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన భారత ఏ జట్టుకు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్యలు ఊహించని రీతిలో సుడిగాలి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను ఆడుతున్న తీరు చూసి ఒకానొక దశంలో భారత్ ప్రాజెక్టెడ్ స్కోరు ఏకంగా 900 పరుగులు దాటేలా కనిపించింది.

కేవలం 8.5 ఓవర్లలోనే ఈ ఓపెనింగ్ జోడీ మొదటి వికెట్‌కు 132 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అయితే, దురదృష్టవశాత్తూ అత్యంత వేగవంతమైన సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. తొమ్మిదో ఓవర్లో సహాన్ అరాచ్చిగే బౌలింగ్‌లో అవుట్ కావడానికి ముందు, సూర్యవంశీ కేవలం 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కూడా 29 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 39 పరుగులు చేసి అవుటయ్యాడు.

×
×
Ad

ఓపెనర్లు ఇద్దరూ వెనుదిరిగిన తర్వాత భారత ఇన్నింగ్స్ వేగం కాస్త తగ్గింది. ఆ సమయంలో కెప్టెన్ తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 51 బంతుల్లో 40 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్‌ను మహ్మద్ షిరాజ్ క్లీన్ బౌల్డ్ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన కుమార్ కుషాగ్ర 36 పరుగులు చేయగా, సూర్యాంశ్ షెడ్గే 2 పరుగులకే నిరాశపరిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ తిలక్ వర్మ క్రీజులో నిలబడి జట్టును ముందుకు నడిపాడు. అతను 90 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 67 పరుగులు చేసి వనూజ సహన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

చివరి ఓవర్లలో భారత బ్యాటర్లు వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నంలో వరుసగా వికెట్లు కోల్పోయారు. నిశాంత్ సింధు 16 పరుగులు, విప్రజ్ నిగమ్ 20 బంతుల్లో 27 పరుగులు చేసి అవుటయ్యారు. భారత్ కనీసం 350 పరుగులైనా చేస్తుందా అనిపిస్తున్న తరుణంలో అనుకుల్ రాయ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 15 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అనుకుల్, ఒక ఫోర్ మరియు 4 భారీ సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి జట్టు స్కోరును 350 మార్కును దాటించాడు. నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఏ జట్టు 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరును సాధించింది. శ్రీలంక బౌలర్లలో కుగాదాస్ మతులన్, రవిందు ఫెర్నాండో, వనూజ సహన్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టగా, మహ్మద్ షిరాజ్, సహాన్ అరాచ్చిగే, దులజ్ సముదిత చెరో వికెట్ సాధించారు. ఆ తర్వాత భారీ లక్ష్యంతో శ్రీలంక ఏ జట్టు తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.