IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!

  • జింబాబ్వేతో మూడో టీ20
  • భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 216 పరుగులు
  • జింబాబ్వే ముందు 217 పరుగుల భారీ లక్ష్యం..
  • హర్మన్‌ప్రీత్ కౌర్ 41 బంతుల్లో అజేయంగా 91 పరుగులు
  • షఫాలి వర్మ 37 బంతుల్లో 69 పరుగులు..
Ind W Vs Zim W

Ind W Vs Zim W

IND-W vs ZIM-W: రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వే మహిళలతో జరుగుతున్న మూడో టీ20లో భారత మహిళల జట్టు బ్యాటింగ్‌లో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో జింబాబ్వే ముందు 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగింది. కేవలం 41 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 221.95 స్ట్రైక్‌రేట్‌తో అజేయంగా 91 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడిన హర్మన్‌ప్రీత్ తృటిలో సెంచరీ చేజార్చుకుంది.

ఓపెనర్ షఫాలి వర్మ కూడా దూకుడుగా ఆడింది. 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసింది. అలాగే అనుష్క శర్మ 20 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేసింది. నికీ ప్రసాద్ 9 పరుగులు చేయగా, రిచా ఘోష్ ఒక పరుగుకే వెనుదిరిగింది. దీప్తి శర్మ ఖాతా తెరవకుండానే ఔటైంది. జింబాబ్వే బౌలర్లలో బెలవ్డ్ బిజా మూడు వికెట్లు పడగొట్టింది. నోమ్‌వెలో సిబాండా, టెండాయ్ మకుషా, న్యాషా గ్వాంజురా తలో వికెట్ తీశారు.