Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..

Team India Women

Team India Women

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో బంగ్లాదేశ్‌పై భారత మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టీమిండియా సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది మూడో విజయం కావడం గమనార్హం.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టును భారత బౌలర్లు చక్కగా కట్టడి చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ జుయైరియా ఫిరదౌస్ (33) అత్యధిక పరుగులు చేయగా, కెప్టెన్ నిగార్ సుల్తానా 32 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టగా.. చివరి ఓవర్లో శ్రీ చరణి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసి రికార్డు సృష్టించింది.

అనంతరం 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ షఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో బలమైన పునాది వేసింది. స్మృతి మంధాన (8) త్వరగానే అవుట్ అయినప్పటికీ, షఫాలీ కేవలం 34 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. మిడిలార్డర్‌లో యాస్తికా భాటియా (23), జెమిమా రోడ్రిగ్స్ (26) వేగంగా ఆడగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచి 19 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని ఖరారు చేసింది.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా షఫాలీ వర్మ..
ఈ మ్యాచ్‌లో దంచికొట్టిన ఓపెనర్ షఫాలీ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. అవార్డు అందుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఈ రోజు నేను బ్యాటింగ్ చేసిన విధానం చాలా సంతోషాన్నిచ్చింది, కానీ మ్యాచ్ ముగిసేవరకు నాటౌట్‌గా ఉండి ఉంటే ఇంకా ఆనందించేదాన్ని. పవర్‌ప్లేలో లూజ్ బాల్స్‌ను బౌండరీలకు తరలించడమే మా ప్లాన్. కెప్టెన్ హర్మన్ నా బౌలింగ్‌పై ఎంతో నమ్మకం ఉంచుతుంది” అని తెలిపింది. తదుపరి జరగబోయే ఆస్ట్రేలియా మ్యాచ్‌పై తాము దృష్టి సారించామని ఆమె పేర్కొంది. భారత్ తన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడిస్తే నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.