Abhishek Sharma React on Century Bat: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. 46 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో సెంచరీ చేశాడు. అభిషేక్‌కు ఇది రెండో అంతర్జాతీయ మ్యాచ్ కాగా.. తొలి సెంచరీ బాదాడు. తక్కువ ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ అందుకున్న భారత ఆటగాడిగా అరుదైన రికార్డు సృష్టించాడు. అయితే ఈ మ్యాచ్‌లో వాడిన బ్యాట్ తనది కాదని అభిషేక్ చెప్పాడు. తాను తన స్నేహితుడు, టీమిండియా తాత్కాలిక కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో ఆడానని తెలిపాడు.
సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా శుభ్‌మన్ గిల్‌తో తనకున్న అనుబంధాన్ని అభిషేక్ గుర్తుచేసుకున్నాడు. ‘అండర్ 12 నుంచి గిల్, నేను కలిసి ఆడుతున్నాం. నా కంటే ముందే గిల్ జట్టులోకి వచ్చాడు. నేను భారత జట్టుకు ఎంపికైనప్పుడు ఫస్ట్ కాల్ అతడి నుంచే వచ్చింది. చాలా సంతోషించాడు. ఈ మ్యాచ్‌లో నేను గిల్ బ్యాట్‌తోనే ఆడాను. ఆ బ్యాట్‌కు, గిల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఒత్తిడి ఉన్న మ్యాచ్‌లలో నేను గిల్ బ్యాట్‌తోనే అడుగుతా. అండర్ 12 రోజుల నుంచి ఇది కొనసాగుతోంది. ఐపీఎల్‌లో కూడా అతడి బ్యాట్‌తో ఆడాను’ అభిషేక్ తెలిపాడు.
Also Read: BCCI Prize Money: ఒక్కో ఆటగాడికి రూ.5 కోట్లు.. రిజర్వ్ ప్లేయర్స్, సహాయక సిబ్బందికి ఎంతంటే?
‘నేను రాణించడానికి కారణం యువరాజ్ సింగ్. యువీ పాజీ నాకు చాలా అండగా నిలుస్తాడు. నన్ను నేను సిక్సర్ కింగ్ లేదా మరోవిధంగా అస్సలు ఊహించుకోను. లాప్టెడ్ షాట్స్ ఆడటానికి అనుమతించిన మా నాన్నకు థాంక్స్. సాధారణంగా యువ ఆటగాళ్లు ఈ షాట్లు ఆడటానికి కోచ్‌లు అనుమతించరు. మా నాన్న ఎప్పుడూ ఒక విషయం చెప్పేవారు. నువ్వు లాప్టెడ్ షాట్ ఆడితే.. బంతి మైదానం బయట ఉండాలనే వారు. ఈ మ్యాచ్‌లో నా ప్రణాళికలు అన్ని వర్కౌట్ అయ్యాయి. మొదటి కొన్ని బంతుల్లో ఫోర్లు లేదా సిక్స్‌లు బాదితే.. అది నా రోజు అని నమ్ముతాను’ అని అభిషేక్ శర్మ చెప్పాడు.