NTV Telugu Site icon

IND vs WI: జట్టు నుంచి ఎందుకు తప్పించారో అర్ధం కావడం లేదు: హనుమ విహారి

Hanuma Vihari

Hanuma Vihari

Hanuma Vihari Said I Did not find a reason why I was dropped from India Team: భారత జట్టు నుంచి తనను ఎందుకు తప్పించారో ఇప్పటికీ అర్థమవడం లేదని టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, తెలుగు తేజం హనుమ విహారి అన్నాడు. తన ఉత్తమ ప్రదర్శన జట్టుకు సరిపోలేదేమో అని, అయినా టీంలో చోటు కోసం మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటా అని విహారి తెలిపాడు. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ 2023 ఆడుతున్న విహారి.. సౌత్ జోన్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. విహారి సారథ్యంలోని సౌత్ జోన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం ప్రారంభమయ్యే ఫైనల్లో వెస్ట్ జోన్‌తో ఢీ కొట్టనుంది.

దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో హనుమ విహారి మీడియాతో మాట్లాడుతూ వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక కాకపోవడంపై స్పందించాడు. ‘టీమిండియా టెస్ట్ టీమ్ నుంచి నన్ను ఎందుకు తప్పించారో అర్ధం కావడం లేదు. నాకు అవకాశం ఇచ్చినప్పుడల్లా జట్టు విజయం కోసం నా వంతు కృషి చేశా. బహుశా ఆ ప్రదర్శన జట్టుకు సరిపోకపోవచ్చు. నా ఆటను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తా. టెస్ట్ జట్టు నుంచి ఎందుకు తప్పించారనే విషయం ఇప్పటికీ ఎవరూ చెప్పలేదు. దీని గురించి నేను ఆందోళన చెందడం లేదు’ అని విహారి తెలిపాడు.

Also Read: Asia Cup 2023 Schedule: ఆసియా కప్‌కు బీసీసీఐ, పీసీబీ గ్రీన్‌ సిగ్నల్‌.. శ్రీలంకలోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్!

‘పునరాగమనం ఎప్పుడూ కూడా కష్టం. ఒక్కసారి చోటు కోల్పోతే మానసికంగానూ ప్రభావం పడుతుంది. గత సీజన్‌లో నేను దాన్ని అనుభవించా. ఈ సీజన్‌లో కేవలం బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టా. ఈ గడ్డు పరిస్థితులు దాటేలా కుటుంబం మద్దతుగా ఉంది. జట్టులో చోటు కోసం మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటా. నాకిప్పుడు 29 ఏళ్లే. అజింక్య రహానే 35 ఏళ్ల వయసులో తిరిగి జట్టులోకి వచ్చాడు. టెస్టు ఆటగాడిగా నాపై ముద్ర వేయడం సరికాదు. ఐపీఎల్‌తో సహా అన్ని ఫార్మాట్లలో నేను ఆడాలనుకుంటున్నా’ అని హనుమ విహారి చెప్పాడు.

గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్ట్ నుంచి భారత జట్టులో తెలుగు తేజం హనుమ విహారీకి చోటు దక్కలేదు. టీమిండియా చివరిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు చారిత్రక టెస్ట్ సిరీస్ విజయంలోనూ అతడు కీలకపాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత ఫామ్ కోల్పోవడంతో బీసీసీఐ సెలక్టర్లు వేటు వేశారు. ఈ ఏడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి కూడా బీసీసీఐ విహారిని తొలగించింది. భారత్ తరఫున విహారి 16 టెస్టులు ఆడి 33.56 సగటుతో 839 పరుగులు చేశాడు.

Also Read: Naveen Polishetty Dialogues: కష్టపడ్డా.. అనుష్క శెట్టితో చేశా! నవీన్ పొలిశెట్టి డైలాగ్స్ వైరల్