IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?

Ind Vs Wi

Ind Vs Wi

IND vs WI: భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అత్యంత కీలకమైన చివరి పోరు శనివారం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. నాలుగు మ్యాచ్‌లు ముగిసేసరికి ఇరు జట్లు 2-2తో సమంగా ఉండటంతో ఐదో టీ20 సిరీస్ డిసైడర్‌గా మారింది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు మరో అరుదైన అవకాశం కూడా ఉంది. 2002 తర్వాత భారత గడ్డపై ఏ ఫార్మాట్‌లోనూ వెస్టిండీస్ సిరీస్ గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని కరీబియన్ జట్టు భావిస్తోంది. మరోవైపు సొంతగడ్డపై సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

అయితే ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముప్పుగా మారింది. వాతావరణ అంచనాల ప్రకారం బెంగళూరులో సాయంత్రం నుంచి వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పూర్తి స్థాయి మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. వర్షం తగ్గి మైదానాన్ని సకాలంలో సిద్ధం చేయగలిగితే ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. నివేదికల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల వరకు బెంగళూరులో వాతావరణం అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 4 గంటల నుంచి వర్షం పడే అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. బలమైన గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం కూడా ఉన్నట్లు అంచనా. సాయంత్రం 4 గంటలకు వర్షం పడే అవకాశం 68% ఉండగా, 5 గంటలకు 71% , 6 గంటలకు 49% గా అంచనా వేశారు. మ్యాచ్ ప్రారంభ సమయమైన రాత్రి 7 గంటలకు 64% వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి 8, 9 గంటలకు 49% చొప్పున, 10 గంటలకు 56%, 11 గంటలకు 49% వర్షం పడే అవకాశం ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయి.

టీ20 మ్యాచ్‌లో ఫలితం రావాలంటే కనీసం ఇరు జట్లు ఐదు ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. మ్యాచ్ నిర్ణీత సమయం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. వర్షం కారణంగా ఆలస్యమైతే ఓవర్లను తగ్గిస్తూ మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. అయితే రాత్రి 10:16 గంటల వరకు తొలి బంతి పడకపోతే మ్యాచ్‌ను రద్దు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అదే జరిగితే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమంగా ముగుస్తుంది. ఒకవేళ ఇలా జరిగితే కప్ ను ఇరుజట్లు అందుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ కు ఎలాంటి రిజరావ్ డే కూడా లేదు. వర్షం కొంత విరామం ఇచ్చి మైదానాన్ని త్వరగా సిద్ధం చేయగలిగితే తక్కువ ఓవర్లతోనైనా సిరీస్ విజేతను నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఇప్పుడు టీ20 సిరీస్ విజేత ఎవరో తేలాలంటే వరుణుడు సహకరించాల్సిందే.